టాక్సీ నడిపిన జీవన్​రెడ్డికి.. వందల కోట్లు ఎలా వచ్చాయ్​? :

నందిపేట, వెలుగు : పొట్టకూటి కోసం దుబాయ్​లో టాక్సీ నడుపుకున్న ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ఆర్మూర్​ బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్​రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని వెల్మల్, కౌల్​పూర్, బజార్​కొత్తూర్ ​గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏండ్ల పాటు ప్రజలను బెదిరించిన జీవన్​రెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం బతిమాడుతున్నాడన్నారు. జీవన్​రెడ్డి వ్యవహార శైలి జంతువులను వేటాడే మృగం దొంగ జపం చేసినట్లు ఉందన్నారు.

నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టార్పాలిన్లతో వేసిన గుడిసెలే దర్శనమిస్తున్నాయని, ఒక్కరికి కూడా డబుల్​ బెడ్ ​రూమ్​ ఇల్లు కట్టివ్వలేదన్నారు. అభివృద్ధి చేసి ఉంటే చీరలు, కుక్కర్లు పంచాల్సిన అవసరం ఏముందన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు భూతం సాయరెడ్డి, నరేందర్, సాయి, గంగాధర్, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.

ఆర్మూర్ : ఆర్మూర్ టౌన్ లోని ఆలూర్ రోడ్ గురడి రెడ్డి రైతు సంఘం సభ్యులు శనివారం రాకేశ్​రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ కింది బజార్ తో ప్రత్యేక అనుబంధం ఉందని ఈ ప్రాంతంలో తన బంధువులు,స్నేహితులు ఎక్కువగా ఉంటారన్నారు. అనంతరం టౌన్ లోని  8, 9వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ నూతుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.