- పంపించాల్సిందేనని ఆర్ఓ ఆఫీసు ముందు రాజగోపాల్రెడ్డి ధర్నా
- పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్
చండూరు, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో బయటి వ్యక్తులు ఎందుకున్నరని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వారిని వెంటనే పంపించాలని బుధవారం రాత్రి చండూరులోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నెల రోజుల నుంచి తనపై, తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికే అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఆయన అక్కడ ఆఫీసర్లు లేకపోవడంతో మెట్లపై పార్టీ కార్యకర్తలతో కలిసి బైఠాయించారు.
‘ప్రచారం ముగిసినప్పటి నుంచి బయటి వ్యక్తులు, టీఆర్ఎస్ గూండాలు మునుగోడు నియోజకవర్గంలోనే ఉంటున్నారు. నిన్న నాపై, ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు. దీంతో మేము నియోజకవర్గంలో ఉండే పరిస్థితి లేదు’ అని అన్నారు. తాను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసమేనని, అది చెప్పుకోవడానికి ప్రజలకు వద్దకు వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని అనుకుంటుంటే అలా జరగనీయడం లేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఆర్ఓ, కలెక్టర్ బయట వ్యక్తుల్ని వెంటనే పంపించాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో 50 మంది చొప్పున పోలీసులను మోహరించాలన్నారు.