మునుగోడు/చౌటుప్పల్, వెలుగు:మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆత్మగౌరవం కోసమే జరుగుతోందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడేలా మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందన్నారు. మంగళవారం మునుగోడులోని తన క్యాంపు ఆఫీసు వద్ద మీడియాతో రాజగోపాల్ మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, కనీసం ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. యువత బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణను కుటుంబపాలన నుంచి రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా అడ్డుకున్నారని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడినా మైకులు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజల ఆవేదనను సర్కారు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్నా మునుగోడును అభివృద్ధి చేయలేకపోతున్నానన్న ఆవేదనతోనే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలె : వివేక్
మునుగోడులో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ లోని బీజేపీ ఆఫీసులో మున్సిపల్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన రివ్యూలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, ప్రతి ఓటరుకూ అవగాహన కల్పించాలని చెప్పారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ చెప్తున్నాయన్నారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి భారీ మెజార్టీ కోసం పని చేయాలని కోరారు. చౌటుప్పల్ లో రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని వివేక్ వెంకటస్వామి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గోని శంకర్, నేతలు కర్నాటి ధనంజయ, భిక్షమాచారి, ఉబ్బు వెంకటయ్య, శ్రీధర్ బాబు, ఆలె నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలోకి సీపీఎం నేతల చేరిక
చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన సీపీఎం నేతలు కృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు నాయకులు మంగళవారం బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి బీజేపీ కండువా కప్పి వారిని పార్టీలోకి
ఆహ్వానించారు.
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ డ్రామా: వివేక్ వెంకటస్వామి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని సర్వేల్లో తేలినందుకే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ డ్రామా ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉప ఎన్నికకు పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లే మునుగోడులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మంగళవారం మునుగోడులోని రాజగోపాల్ క్యాంపు ఆఫీసు వద్ద మీడియాతో వివేక్ మాట్లాడారు. ఉప ఎన్నిక వచ్చినందుకే యాదవులకు గొర్రెల పంపిణీ పైసలు అకౌంట్లలో వేస్తున్నారని, దళితబంధు స్కీమ్ అమలు చేస్తున్నారని చెప్పారు. రూ.2,500 కోట్లు మాత్రమే ఖర్చయ్యే ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే కమీషన్లు రావని పక్కన పెట్టారని, కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టునే పూర్తి చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితబంధు పేరుతో లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేసి ఆకౌంట్లు ఫ్రీజ్ చేశారని, ఇప్పుడు మునుగోడులో కూడా అధికార పార్టీ అదే వ్యూహం అమలు చేస్తుందన్నారు. మునుగోడులోనూ హుజూరాబాద్ ఫలితమే రిపీట్ అవుతుందని, రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.