మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరు: రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ నేతలు మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బయటి నుంచి వచ్చిన నాన్ లోకల్ నేతలు బీజేపీ కార్యకర్తలను బెదరిస్తున్నారని ఆరోపించారు. బయటి నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా మునుగోడులోనే ఉన్నారని చెప్పారు. పోలింగ్ బూత్ లలో ఏజెంట్లను కూర్చొవద్దని వారి ఇంటికి వెళ్లి బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు గుండాల్లాగా వ్యవహరిస్తూ డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ నేతలు కార్లలో వచ్చి డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నా..పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పార్టీకి చెందిన నేతలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో జరిగే ధర్మయుద్ధంలో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.