కేసీఆర్ కాంగ్రెస్ను చంపితే.. పులిలా బీజేపీలో చేరిన : రాజగోపాల్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్కు అహంకారం ఎక్కువైందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడిని, జాతిపితను అని చెప్పుకునే సీఎం.. ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించమని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పంపితే వాళ్లలో 12 మందిని సీఎం కేసీఆర్ కొన్నడని రాజగోపాల్ ఆరోపించారు. చిన్న కొండూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తాను అమ్ముడుపోయే వాడినైతే ఆ 12 మంది ఎమ్మెల్యేల వెంట టీఆర్ఎస్ లో చేరేవాడిని కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరితో రాష్ట్రంలో ప్రజాస్వామ్యమన్నదే లేకుండా పోయిందని వాపోయారు. 

నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం 100సార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా ఒక్కసారి కూడా ఇవ్వలేదని రాజగోపాల్ ఆరోపించారు. సీఎం తమ బాధలు విననప్పుడు, ప్రభుత్వం సహకరించనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగి ఏం చేయాలమే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని అన్నారు. తాను ప్రజల కోసం పదవీ త్యాగం చేస్తే కేసీఆర్100 మంది కౌరవ సైన్యాన్ని తీసుకొచ్చాడని రాజగోపాల్ మండిపడ్డారు. పైసలు ఎరవేసి లీడర్లను కొంటున్నాడని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ 8ఏండ్లలో తాగుబోతుల తెలంగాణలా మార్చిండని రాజగోపాల్ ఫైర్ అయ్యారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నడని విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ సాధు జంతువులాంటి కాంగ్రెస్ పార్టీని చంపితే.. తాను మాత్రం పులిలా బీజేపీలో చేరానని రాజగోపాల్ అన్నారు. అరాచక కుటుంబ పాలనను బొందపెట్టాలా వద్దా చిన్న కొండూరు ప్రజలే తేల్చుకోవాలని రాజగోపాల్ ప్రజలకు సూచించారు.