సూర్యాపేటకు రైల్వే లైన్ తీసుకొస్తా : సంకినేని వెంకటేశ్వర రావు

సూర్యాపేట, వెలుగు:తనను గెలిపిస్తే సూర్యాపేటకు రైల్వే లైన్ తీసుకొస్తానని,  యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని  సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని  వెంకటేశ్వర రావు హామీ ఇచ్చారు. సోమవారం ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ గుండగాని జాని, దిండుగళ్ల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో 7,8,9,24 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌‌ కుటుంబం, కొందరు బీఆర్ఎస్‌ నేతలు తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు.

సూర్యాపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లు పేదలకు కాకుండా కౌన్సిలర్లు చెప్పిన వారికి ఇచ్చారని ఆరోపించారు.  దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి కూడా బీఆర్ఎస్‌ కార్యకర్తలకే ఇచ్చారని మండిపడ్డారు.  కొత్తగా ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, వైన్స్‌లు, బెల్ట్‌ షాపులు మాత్రం వేలల్లో తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరులు అభివృద్ధి పనుల ముసుగులో  అక్రమంగా ఆస్తులు  కూడబెట్టారని ఆరోపించారు.

ఎన్నికలు రావడంతో  ప్రజలపై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. బీజేపీకి  అవకాశం ఇస్తే కుటుంబంలో ఇద్దరికి ఆసరా ఫించన్లతో పాటు  రైతులకు రెండు బస్తాల యూరియా,  డీఏపీలను ఉచితంగా అందజేస్తామన్నారు. అలాగే సంకినేనికి మద్దతుగా బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేతి వరుణ్ రావు ఆధ్వర్యంలో  200 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.