మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఎలాంటి విబేధాలు లేవని.. మేం అంతా ఒక్కటే అని.. కరీంనగర్ అభివృద్ధికి ఇద్దరం కలిసి పని చేస్తాం అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి.. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పని చేస్తాం అన్నారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్. మంత్రి పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ మధ్య గ్యాప్ ఉందని.. నాకు పొన్నం మధ్య మాత్రం ఎలాంటి విబేధాలు లేవంటూ బహిరంగ వేదికపై నుంచే సంచలన కామెంట్స్ చేశారు బండి సంజయ్.

2025, జనవరి 24వ తేదీ కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం బహిరంగ సభ వేదిక దగ్గరకు చేరుకున్న కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. ఈ వేదికపై నుంచే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తిగా మారింది. 

Also Read :- దిల్ రాజు ఇంట్లో ముగిసిన సోదాలు

మేమంతా ఇంత మంచిగా కలిసి ఉండటం చూసి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కూడా ఆశ్చర్యపోతున్నారని.. మా ఖమ్మంలో ఎప్పుడూ కొట్లాటలే.. ఇలా ఎప్పుడు ఉంటుందా అని పొంగులేటి అనుకుంటున్నారంటూ.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వేదికపై, సభలో నవ్వులు పూయించాయి. 

ఈ వేదిక నుంచే మంత్రి పొన్నం, గంగుల కమలాకర్ మధ్య ఉన్న గ్యాప్ కూడా పోతుందని.. కరీంనగర్ అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి పని చేస్తాం అన్నారు బండి సంజయ్. గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 12 లక్షల కోట్లు ఇచ్చిందని.. ఎన్ని నిధులు కావాలన్నా విషయానికి కేంద్రం సిద్ధంగా ఉందని.. ఆ నిధులతో అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు బండి సంజయ్.