స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, ప్రేమెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని సాగుతున్న గడీల పాలనను అంతమొందించాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టి.. అరాచక పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపాలని ఆయన కోరారు. ‘ రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తుంది. ఆ కాలంలో కింగ్ కోటి-ఫలక్ నూమా ప్యాలెస్ ల నుంచి రజాకార్ల పాలన నడిచినట్లే… ఇప్పుడు ప్రగతి భవన్, ఫాం హౌస్ నుంచి కేసీఆర్ పాలన నడుస్తుంది. ఆనాడు రజాకార్లపై తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే… ఈనాడు రజాకార్ల వారసులను కేసీఆర్ పక్కన చేర్చుకున్నాడు. రజాకార్ల పాలనను అంతమొందించేందుకు ప్రజలు ప్రాణత్యాగం చేసిన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదు. ప్రాణ త్యాగం చేసిన అమరుల చరిత్రను చెరిపి.. కేసీఆర్ తన కుటుంబ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలనుకుంటున్నాడు. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్రానికి కేటాయిస్తే.. పైసా కూడా ఖర్చు చేయడం లేదు. మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రం ఖాతాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదు. తన కుటుంబ రక్షణ, కమీషన్లకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కేసీఆర్ తీరు కారణంగా తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా సంతోషంగా జరుపుకోవడం లేదు. గడీల పాలన అంతమొందించి.. టీఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టాలంటే.. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కష్టించి పని చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
For More News..