ఎక్కడ హత్యలు, కబ్జాలు జరిగినా టీఆర్ఎస్ నేతలే కారణమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, రామాయంపేటలో తల్లీ, కొడుకు సూసైడ్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ రెండు ఘటనలకు సంబంధమున్న టీఆర్ఎస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ లోని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శిబిరం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిరసన దీక్షకు దిగారు. హత్యలు..ఆత్మహత్యలు.. అత్యాచారాల పేరుతో టీఆర్ఎస్ చేస్తున్న దాష్టీకాలను నిరసిస్తూ ముఖానికి ‘నల్ల మాస్క్’ ధరించి నిరసన చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. మనం చూడని నిజాం పాలనను టీఆర్ఎస్ చూపిస్తుందన్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు వేధింపులు,పోలీసుల దాష్టీకాలకు రామాయంపేటలో తల్లీ కొడుకులు, ఖమ్మంలో సాయిగణేశ్ బలయ్యారన్నారు.వీరి ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. సాయిగణేశ్ హత్య ప్రభుత్వ హత్యేనన్నారు. రాష్ట్రంలో రజాకార్లను మించిన పాలన సాగుతుందన్నారు. తప్పు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సాయిగణేవ్ ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్షపడే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదే ఇష్యూపై గవర్నర్ తమిళిసైని కలిశారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై వినతి పత్రం అందించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అధికార పార్టీ రాజకీయ ఆగడాలను ఖండించాలన్నారు నేతలు. ఇవాళ ఖమ్మంలో పర్యటించనున్నారు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్. సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మృతికి సంబంధించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు రాజీవ్ చంద్రశేఖర్.