రేపు సాయంత్రం హీరో నితిన్ తో నడ్డా భేటీ

రేపు సాయంత్రం హీరో నితిన్ తో నడ్డా భేటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఆగస్టు 27న సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు నడ్డా శనివారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు సమీపంలోని నోవాటెల్ హోటల్ లో కాసేపు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులతో నడ్డా భేటీ కానున్నారు.

మధ్యాహ్నం 2.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరుతారు. 3 నుంచి 3.15 గంటల సమయంలో వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4.10 నుంచి 5.40 గంటల వరకు  ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే పాదయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. సాయంత్రం 5.55 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 6.30 గంలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి నడ్డా వెళ్లిపోతారు. కాగా, వరంగల్ నగర పర్యటన సందర్భంగా  ప్రొఫెసర్‌ వెంకటనారాయణతో నడ్డా భేటీ అవుతారు. ఇక శనివారం సాయంత్రం నోవాటెల్ హోటల్ కు రావాలని  సినీ నటుడు నితిన్ ను జేపీ నడ్డా ఆహ్వానించడం గమనార్హం.