మాజీ సీఎంలకు షాక్!

మాజీ సీఎంలకు షాక్!

ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా 60 ఏండ్లకే పదవీ విరమణ చేస్తారు. కానీ, భారతదేశంలో రాజకీయ నాయకులకు పదవీ విరమణ వయస్సు అంటూ ప్రత్యేకంగా లేదు. మన దేశంలో ప్రధానమైన సమస్య ఏమిటంటే ఎన్నికలు,  అధికారం.. పార్టీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. మన రాజకీయ వ్యవస్థలో నేతలు పార్టీని నియంత్రిస్తే ఇక వారికి పదవీ విరమణ ఉండదు. మధ్యప్రదేశ్‌‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌‌ సింగ్​ చౌహాన్‌‌, ఛత్తీస్‌‌గఢ్‌‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి రమణ్‌‌సింగ్‌‌, రాజస్థాన్‌‌కు చెందిన మాజీ సీఎం వసుంధర రాజేలను భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టడంపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీలో  సీనియర్​ నేతలను పక్కన పెట్టాలని చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రాజకీయం అనేది ‘బ్లడ్​ స్పోర్ట్’.  ఇది కిక్- బాక్సింగ్ కంటే దారుణమైన ఆట. ఇది దయ అనేది చూపదు. 2014లో బీజేపీ ఓడిపోయి ఉంటే, బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ తదితరులు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని కూడా బర్తరఫ్ చేసి ఉండేవారు. రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్లో నిరంతరం కొత్త రక్తం ఉండాలి. గత 75 ఏండ్ల  బ్రిటీష్ చరిత్రలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓడిపోయి మళ్లీ  తిరిగి అధికారంలోకి వచ్చినవారిలో  బ్రిటన్ ప్రధాని విన్‌‌స్టన్ చర్చిల్
ఒక్కరే ఉన్నారు. 

వసుంధర రాజేకు షాక్​

రాజస్తాన్​ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే బీజేపీ తరఫున 1985 నుంచి ఆధిపత్యం చెలాయించారు. ఆమె ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. అదేవిధంగా రెండుసార్లు రాజస్తాన్​ ముఖ్యమంత్రిగా పాలించారు. 2003 నుంచి 2008 వరకు, అనంతరం 2013 నుంచి 2018 వరకు వసుంధర రాజే సీఎంగా వ్యవహరించారు. అయితే ఆమె పాలన అనంతరం రెండుసార్లు బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆమెను పక్కన పెట్టింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధర రాజేకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్​ ఇచ్చింది. 

కానీ, ఎన్నికల అనంతరం ఆమెను పక్కనపెట్టే విషయాన్ని సూచనప్రాయంగా కూడా తెలియజేయలేదు. రాజస్తాన్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ఆమెను కాదని కొత్తవారిని తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతో అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే బీజేపీ ఎంపీగా ఉన్న తన కుమారుడు దుష్యంత్​ సింగ్​ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని వసుంధర రాజేకు తెలుసు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ వసుంధర రాజేను ధైర్యంగా పక్కన పెట్టింది. సీఎంగా అధికార పీఠాన్ని అందించిన రెండుసార్లు వసుంధర రాజే  పరాజయాలకు కారణమవడంతో ఈసారి బీజేపీ ఆమెకు షాక్​ ఇచ్చి చెక్ పెట్టింది.

 స్పీకర్​గా  రమణ్​ సింగ్

చత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల ఉజ్వల కెరీర్‌‌ను కలిగి ఉన్నారు. 2003 నుంచి 2018 వరకు పదిహేను సంవత్సరాలపాటు రమణ్ సింగ్ ఛత్తీస్‌‌గఢ్‌‌ను  సీఎంగా చాలా జాగ్రత్తగా పాలించారు.  ఈ విషయంలో అగ్రనాయకత్వం ఆయనను ఎప్పుడూ వేలెత్తి చూపించలేదు. అయితే చత్తీస్​గఢ్​ ప్రజల్లో రమణ్‌‌సింగ్‌‌ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత ఏర్పడింది. దీంతో 2018లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారం చేజిక్కించుకుంది. చత్తీస్​గడ్​లో 90 మంది ఎమ్మెల్యేలకు గానూ బీజేపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు. 2023లో శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రమణ్‌‌సింగ్‌‌కు టిక్కెట్‌‌ ఇచ్చారు. కానీ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ గిరిజన నేత విష్ణు సాయ్​ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్​సింగ్​కు స్పీకర్​ పదవితో సర్దుబాటు చేశారు.

శివరాజ్ సింగ్​కు ఉద్వాసన

మధ్యప్రదేశ్‌‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2005 నుంచి 2023 వరకు ఏకచ్ఛత్రాధిపత్యంతో సీఎంగా వ్యవహరించారు. మధ్యలో ఒక సంవత్సరం చిన్న గ్యాప్‌‌ తప్పిస్తే ముఖ్యమంత్రిగా నిరాటంకంగా మధ్యప్రదేశ్​ను పాలించారు. అయితే, 2018లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా శివరాజ్ చౌహాన్ సింగ్​ హయాంలో మధ్యప్రదేశ్​లో బీజేపీ ఓడిపోయింది. 

ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్​ చౌహాన్ పూర్తిస్థాయిలో మధ్యప్రదేశ్​ ప్రజల ఆదరణ పొందలేదని,  గెలుపు కోసం పార్టీపై ఆధారపడ్డారని బీజేపీ హైకమాండ్​ గ్రహించింది. శివరాజ్​ సింగ్​ చౌహాన్ సీఎంగా ఉన్నంత కాలం మధ్యప్రదేశ్‌‌లో ఏ నాయకుడూ ఎదగలేదని బీజేపీ అధిష్టానానికి తెలుసు. బీజేపీ ‘వారసత్వ ప్రణాళిక’లో భాగంగా శివరాజ్ సింగ్​ చౌహాన్ తన పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. 

సీఎంలను ఎందుకు మార్చారు?

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. కీలక సమయంలో బీజేపీ మూడు రాష్ట్రాల్లో సీనియర్లను కాదని కొత్తవారికి పట్టం కట్టింది. బీజేపీ వ్యూహాన్ని పరిశీలిస్తే..కొత్త నాయకులను సృష్టించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా "సక్సెషన్ ప్లానింగ్" ను బీజేపీ రూపొందించింది. పార్టీలోకి కొత్త నాయకులు రాకపోతే, ప్రజాదరణ పొందకపోతే, ప్రస్తుత నాయకుల మరణానంతరం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ జీరో అవుతుందని కమలం పార్టీ గ్రహించింది. సక్సెషన్​ ప్లానింగ్​లో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కొత్త నేతలను ఎంపిక చేస్తోంది. 

ప్రాంతీయ పార్టీలు, కుటుంబ వారసత్వ పార్టీలు అలాంటి మార్పులు చేయలేవు. కరుణానిధి, జయలలిత, ప్రకాష్‌‌సింగ్ బాదల్ కొత్తవారికి దారి ఇవ్వడానికి నిరాకరించారు. అయితే దీనికి భిన్నంగా ఉత్తరప్రదేశ్‌‌లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2016లో ఆయన తన తండ్రి ములాయం సింగ్‌‌ను అక్షరాలా పార్టీ నుంచి బయటకు గెంటేశాడు. ప్రాంతీయ పార్టీల వారసత్వ రాజకీయాలను పక్కనపెడితే ఒక జాతీయ పార్టీ తప్పనిసరిగా "వారసత్వం" విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.

 మధ్యప్రదేశ్​, రాజస్తాన్​, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లోని ఈ ముగ్గురు బీజేపీ సీనియర్​ నాయకులు కేవలం పార్టీ బలం వల్లే మూడు రాష్ట్రాల్లో గెలిచారు. ఈ ముగ్గురిలో శివరాజ్ సింగ్ చౌహాన్ గొప్ప రాజకీయవేత్త  అనేది వాస్తవం. అందుకే ఆయనను పదవి నుంచి తప్పించడం చాలా కష్టమైంది. వసుంధర రాజేని వదిలించుకోవడం కూడా బీజేపీకి కష్టమే. ఆమె గ్వాలియర్ మహారాజు కుమార్తె, దివంగత మాధరావు సింధియా సోదరి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అత్త. వసుంధరకు మీడియా సపోర్టు కూడా బాగానే ఉంది. కానీ ఈసారి బీజేపీ రిస్క్ తీసుకుంది.

బీజేపీ సాహసం

రాజస్తాన్​, మధ్యప్రదేశ్​, చత్తీస్​గడ్​ ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ పూర్తిగా కొత్త నేతలనే ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. ఛత్తీస్‌‌గఢ్ తాజా ముఖ్యమంత్రి విష్ణు సాయ్​కు చాలా రాజకీయ అనుభవం ఉంది. సర్పంచ్​ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఇక ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాలనాపరంగా విఫలం కాకుండా చూసుకోవాల్సిన అవసరం బీజేపీ అధిష్టానంపై ఉంది. 

కొత్త ముఖ్యమంత్రులకు మద్దతుగా  ఉప ముఖ్యమంత్రుల బృందం కూడా ఉంది. అయితే బీజేపీ వ్యూహం సక్సెస్​ అయిందా లేదా,  బీజేపీ సరైన పనినే చేసిందా లేదా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. బీజేపీ రిస్క్ తీసుకుంటే తప్ప మార్పు, గెలుపు ఉండదని భావించింది. గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ 2500 సంవత్సరాల క్రితం చెప్పినట్లు- ‘మార్పు మాత్రమే స్థిరమైనది’.  భారతదేశంలో చాలా నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి.  సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా బీజేపీ సాహసోపేతమైన చర్యలు తీసుకుంది. 

ప్రమోషనా? డిమోషనా?

బీజేపీ అధిష్టానం చాలా ఆలోచించిన తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్‌‌లలో కొత్త ముఖాల వైపు మొగ్గు చూపింది. వీరి రాక వెనుక భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, కుల సమీకరణలు ఎన్నో ఉన్నాయి. మధ్యప్రదేశ్ తాజా మాజీ సీఎం శివరాజ్ సింగ్​ చౌహాన్, రాజస్తాన్​ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, చత్తీస్​గఢ్​ మాజీ సీఎం రమణ్ సింగ్ దశాబ్దాలపాటు  వారి రాష్ట్రాలలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. 

ప్రస్తుతం బీజేపీ హైకమాండ్​ యువ నాయకత్వం ఉద్భవించాలని కోరుకుంటోంది: 1972 నుంచి అద్వానీ బీజేపీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారని, ఎవరినీ ఎదగనివ్వలేదని భారతీయ జనతాపార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుంచుకోవాలి. బీజేపీ కురు వృద్ధుడు అద్వానీకి పెద్ద కోటరీ ఉంది.  కానీ, ఆయన కొత్త నాయకులను ప్రోత్సహించలేదు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన అద్వానీ 2014లో కూడా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలనే కోరుకున్నారు.

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​