తెలంగాణలో కాషాయం జోరుకు కాంగ్రెస్ కళ్లెం వేయగలదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారడమే అందుకు కారణం. అయిదు నెలల కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తాజా ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇస్తోంది. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా సానుకూలత ఉంది. తెలంగాణలోని 17 స్థానాలకు గాను, రెండంకెల స్థానాలు ఎవరికి వస్తాయి? అన్నది ఇంకా ప్రశ్నార్థకమే!
‘పీపుల్స్‌పల్స్’ సర్వే సంస్థ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఏ ఒక్కపార్టీకి రెండంకెల స్థానాలు రాకపోవచ్చు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రెండంకెల సీట్ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉండి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ అక్కడక్కడా నిలబడ్డట్టే కనిపిస్తున్నా.. లోక్‌సభ స్థానాలు గెలిచేపాటి పటుత్వం, నిలకడ కనబరచడం లేదు. బీఆర్‌ఎస్ నుంచి మారుతున్న ఓటే బీజేపీకి మరింత బలం చేకూరుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. సంస్థాగతమైన సొంతబలం, గట్టి అభ్యర్థి ఉండి ప్రభుత్వ సానుకూలత తోడైన చోట కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. అభ్యర్థుల ఎంపిక తప్పిదాల నుంచి వేర్వేరు కారణాలతో కాంగ్రెస్ విఫలమైనచోట బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. చివరి రెండు, మూడు రోజులు గట్టిగా ప్రయత్నించి, ఉన్నంతలో తమ పరిస్థితిని మెరుగుపరచుకునే పనిలోపడ్డాయి ఈ మూడు ప్రధాన పార్టీలు.
రాష్ట్రంలో బీజేపీ పరిణామ క్రమం!
విభక్త ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ బీజేపీకి ఇప్పుడున్నదే రాజకీయంగా అత్యున్నత స్థితి! కిందటిసారి లోక్‌సభ ఎన్నికల్లోనే అనూహ్యంగా 4 స్థానాలు గెలిచి రికార్డు సృష్టిస్తే, ఇప్పుడు మరింత జోరుతో దూసుకుపోతున్న తీరు బీజేపీ వర్గాలకు సంతృప్తినిస్తోంది. ఇది ఒకరోజులోనో, ఒక్క పరిణామంతోనో వచ్చింది కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో భారీ విజయం తర్వాత పార్టీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నెగ్గిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక (2020), తర్వాతి హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు, బీఆర్‌ఎస్ నుంచి వచ్చి, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నెగ్గిన హుజూరాబాద్ ఉప ఎన్నిక... ఈ క్రమంలో బీజేపీ ఊపు బలపడుతూ వచ్చింది. అది మునుగోడు ఉపఎన్నిక వరకూ సాగింది.
దాదాపు ఈ సమయమంతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ శైలి, పనివిధానం కూడా బీజేపీకి కొంత ఊపు తెచ్చింది. పార్టీ అంతర్గత కారణాలతో ఆయనను పదవి నుంచి తప్పించడం, పార్టీని కుంగదీసింది. పెద్దఎత్తున ఆశలు, అంచనాలతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టులకు పట్టున్న ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాలతో కూడుకుని ఉన్న దక్షిణ తెలంగాణలో మొదట్నుంచీ బీజేపీ కొంత బలహీనమే! అటువంటిది బీజేపీ ఈ ఎన్నికల్లో బాగా పుంజుకుని రాష్ట్రవ్యాప్తంగా పోటీలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఆదిలాబాద్, నిజామాబాద్. కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మెదక్, మహబూబ్‌నగర్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. హైదరాబాద్ లోనూ గెలుస్తామని బీజేపీ ప్రచారం చేస్తోంది. అయినా అదంత తేలిక కాదు!
రెండు పార్టీలూ కారణమే!
రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆ పార్టీ నాయకత్వం కృషి కన్నా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకత్వ వైఖరే ఎక్కువ దోహదపడింది. కాంగ్రెస్ తనకు పోటీయే కాదని, తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీయే అని సుదీర్ఘకాలంగా బీఆర్‌ఎస్ చేసిన ప్రచారం వెనుక ఓ వ్యూహం ఉంది. సంస్థాగతంగా కాంగ్రెస్‌కున్న వ్యవస్థాపక బలం ముందు బీజేపీ నిలువదు. క్యాడర్ పార్టీతో ఎప్పటికైనా ప్రమాదమే! ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా ఎదిగిన తాము తిరుగులేనివిధంగా తెలంగాణలో స్థిరపడాలంటే, క్యాడర్ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా, బీజేపీ ఎదిగినా పెద్ద లక్ష్యపెట్టకుండా ఉంటే రాజకీయంగా తనకు ప్రయోజనకరమని బీఆర్‌ఎస్ తలపోసింది. అది, ఎన్నికల ముందు బీజేపీ ఎదుగుదలకు ఎంతగానో కలిసి వచ్చింది. కానీ, బీఆర్‌ఎస్ అంచనాలు తారుమారై స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ అనూహ్యంగా ఎదిగి ఎన్నికల్లో విజేత అయింది. ఎన్నికల్లో ఓడి చతికిలపడిన బీఆర్‌ఎస్‌ను, ఇదే అదనుగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని అధికార కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం కొంత ఫలించింది. కానీ, కాంగ్రెస్ గ్రహించని, గ్రహించాల్సిన విషయం ఏమంటే.. అధికారం పోవడంతో బీఆర్‌ఎస్ బాగా బలహీనపడి, అదంతా పరోక్షంగా బీజేపీకి లాభించింది. వివిధ స్థాయి నాయకశ్రేణితో పాటు కార్యకర్తలు ‘పొలో’మంటూ బీజేపీలోకి వలస కట్టారు. అది ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సానుకూలమైంది.
ఈ పాట్లతో ఓట్లు సరే, మరి సీట్లు?
పార్టీ ఆవిర్భావం నుంచి ఏనాడూ తలపడని చౌకబారు టెక్నిక్‌లకు కేసీఆర్ దిగుతున్నారే! అని జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలకు కూడా హెలికాప్టరెక్కి గాల్లో తిరిగిన కేసీఆర్.. ‘టీకొట్టు దగ్గర ఆగుదాం, జనంతో మాటాడుదాం, వీధి మలుపు సమావేశాలు పెడదాం’ అంటూ ఈసారి నేలకు దిగి చెమటోడుస్తున్నారు. మిర్యాలగూడలో మొదలెట్టి 16 రోజుల్లో 13 నియోజకవర్గాలు చుట్టి స్వస్థలం సిద్దిపేటలో ప్రచారం ముగిస్తున్నారు. నడుంకట్టి కేసీఆర్ దిగడంతో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, ఓటర్లు నిలిచారనే సమాచారం ఉంది. కానీ, సీట్లు తెచ్చిపెట్టే నమ్మకమైన పరిస్థితి ఎక్కడా రాలేదు. సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ సీట్లతో కూడిన మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా బాగా వెనుకబడి ఉండటమే వారి దుస్థితికి నిదర్శనం! బీఆర్‌ఎస్ పతనం ఇవాల్టిది కాదు. 2019 లోక్‌సభ ఫలితాల నుంచే మొదలైంది. ‘సారు, కారు, పదహారు’ అని ప్రచారం ఎంత హోరెత్తించినా 9 సీట్లకు జనం వారిని పరిమితం చేశారు. మెదక్, నాగర్‌కర్నూల్ వంటి నియోజకవర్గాల్లో మినుకుమినుకుమనే అవకాశాలతో బీఆర్‌ఎస్, ‘ఎక్కడైనా ఖాతా తెరవకపోతామా?’ అని ఎంతో ఆశగా నిరీక్షిస్తోంది.
కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది
పీపుల్స్‌పల్స్ జరిపిన ఒక ప్రాథమిక సర్వేలో... ‘కొత్త ప్రభుత్వం బాగుంది, పరవాలేదు’ అన్నవారు 62 శాతం పైగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ లన్నీ యథాతథం ఇంకా అమల్లోకి రాకున్నా, వారు ఆ బాటలోనే ఉన్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు. మొత్తంమ్మీద రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి (7) నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు క్షేత్ర సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఖాతా తెరవటం, వచ్చే స్థానికసంస్థల ఎన్నికల నాటివరకు పార్టీని బతికించుకోవడం మీద బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. రెండంకెల స్థానాలపై బీజేపీ గురిపెడితే, బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు గెలవటంపై కాంగ్రెస్ కన్నుపెట్టిన ఎన్నికలు ఇవి!
తప్పులు కొన్ని, తప్పక కొంత..
కాంగ్రెస్ ప్రచారం పెద్ద వ్యూహాత్మకంగా లేదు. ముందంతా ‘చచ్చిన పాము’లాంటి బీఆర్‌ఎస్‌ని లక్ష్యం చేసుకొని, దానికి వ్యతిరేక ప్రచార పంథాతోనే వెళ్లారు. కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ వచ్చి, మందలించాక... దిశ మార్చి బీజేపీని లక్ష్యం చేసుకొని ప్రచారపర్వం ఉధృతం చేశాక గాడిలో పడింది. ముందనుకున్నట్టు పట్నం సునీతను చేవెళ్ల అభ్యర్థిగానే ఉంచి, తర్వాత పార్టీలోకి వచ్చిన రంజిత్ రెడ్డిని మల్కాజిగిరిలోనో, నిజామాబాద్‌లోనో అభ్యర్థిని చేసి ఉంటే పార్టీ అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేవనేది సగటు కార్యకర్తల భావన. నిజామాబాద్‌కు కాకుండా, అప్పుడు జీవన్‌రెడ్డిని కరీంనగర్ అభ్యర్థిని చేసే అవకాశం ఉండేది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి ఖైరతాబాద్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దానం నాగేందర్‌ని, కనీసం రాజీనామా చేయించకుండానే సికింద్రాబాద్‌కి పార్టీ అభ్యర్థిని చేయడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతా బాగున్న ఖమ్మంలో ఆఖరు నిమిషం వరకూ అభ్యర్థిత్వం ఖరారు చేయక పార్టీ నాయకత్వం తగని తాత్సారం చేసింది. ఇటువంటి ప్రతికూలతల నడుమ కూడా పార్టీకి కలిసివస్తున్న అంశం..నాలుగయిదు నెలల కింద ఏర్పడ్డ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇంకా సానుకూలత ఉండటమే.
- దిలీప్‌రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ