మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ పవర్

  • ప్రచారం చేసిన మెజారిటీ  సీట్లలో మహాయుతి అభ్యర్థుల గెలుపు

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన చాలా చోట్ల సీట్లలో మహాయుతి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 11 అసెంబ్లీ, నాందేడ్ ఎంపీ బై పోల్ అభ్యర్థుల గెలుపునకు పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఇందులో లాతూరు, నాందేడ్​ మినహా మిగతా చోట్ల అభ్యర్థులు గెలిచినట్టు జనసేన పార్టీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువ ఉండడంతో ఎన్డీఏ.. పవన్ కు ప్రచార బాధ్యతలు అప్పగించింది.

 మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర , దెగ్లూర్, భోకర్, షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ నార్త్, సౌత్, బల్లార్ పూర్, చంద్రపూర్, పుణె కంటోన్మెంట్, కస్బాపేట, హడప్సర్ సీట్లలో పవన్ కల్యాణ్ రోడ్ షో చేపట్టడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు ఓటర్లు ఎక్కువ ఉండే నియోజకవర్గాల్లో పీకే ప్రచారానికి పబ్లిక్ భారీగా వచ్చారని పార్టీ తెలిపింది. మహాయుతి కూటమి ఘన విజయం సాధించటం పట్ల పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ,  కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు బీజేపీ నేత, డిప్యూటీ సీఎం  దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీఎం ఏక్ నాథ్​ షిండ్ కు ట్విట్టర్​ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధికి, సుస్థిరమైన పాలనకు మరాఠా ప్రజల ఐక్యత కోసం కూటమికి ప్రజలు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు మోదీపై, వికసిత్​భారత్ నినాదంపై నమ్మకంతో ఈ ఎన్నికల్లో కూటమికి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారని చంద్రబాబు ట్వీట్ చేశారు.