- బల్దియా ఆస్తులను అమ్మితే ఊరుకోం
- కౌన్సిల్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయట్లే
- అపాయింట్మెంట్ ఇచ్చి మేయర్ ఆఫీసుకు రావట్లే
- జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు ముందు బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న జీహెచ్ఎంసీ ఆస్తులను అమ్మితే ఊరుకోబోమని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. బల్దియా అప్పులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఆస్తులను అమ్మేందుకు స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నోటీసు ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు మేయర్ రాకపోవడంతో అక్కడే నిరసన వ్యక్తం చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మేయర్ రాకపోవడమేంటని మండిపడ్డారు. ఈ సందర్భంగా గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న జీహెచ్ఎంసీ అప్పుల్లోకి వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. ప్రస్తుతం వస్తోన్న ఆదాయం అప్పుల వడ్డీలు చెల్లించేందుకే సరిపోతుండటంతో జీహెచ్ఎంసీ ఆస్తులను అమ్మేందుకు స్కెచ్ వేస్తున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. లేకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. బల్దియా ఎన్నికలు జరిగి 9 నెలలు దాటినా ప్రత్యక్షంగా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. మొదటి సమావేశం కూడా నామ్‌కే వాస్తేగా వర్చువల్‌గా నిర్వహించారన్నారు. ఇలాగైతే నగర సమస్యలపై ఎలా చర్చించాలని ప్రశ్నించారు. సోమవారం మరోసారి మేయర్‌ను కలిసేందుకు వస్తామని అప్పుడు కూడా కౌన్సిల్ మీటింగ్‌పై క్లారిటీ రాకపోతే బల్దియా హెడ్డాఫీసు ముందు ధర్నా చేస్తామని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, అధికారులకు చెప్పినా పరిష్కారం కావడం లేదన్నారు. ఆందోళనలో సరూర్ నగర్, బాగ్ అంబర్ పేట, హిమాయత్ నగర్, రామాంతపూర్, జియాగూడ, గోషామహల్, గౌలిపురా, కాచిగూడ, నల్లకుంట డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, పద్మ, మహాలక్ష్మి, బండారి శ్రీవాణి, దర్శన్, లాల్ సింగ్, భాగ్యలక్ష్మి, ఉమారాణి, అమృత తదితరులు పాల్గొన్నారు.