లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ గతవారం 107 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. అందులో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా 25 మంది నేర చరితులు ఉన్నారు. అయితే క్రిమినల్స్ కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ సమర్థించుకుంది. వారిపై క్రిమినల్ కేసులున్నప్పటికీ వారందరికీ ప్రజల్లో మంచి పేరు ఉందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వారిని కేసుల్లో ఇరికించారని చెప్పింది. బీజేపీ తరఫున సిరథు నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యపై 4 క్రిమినల్ కేసులున్నాయి. అయితే నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఆయనకు ఉన్న మంచి పేరు కారణంగానే పార్టీ జిల్లా యూనిట్ ఆయన పేరును ప్రతిపాదించినట్లు బీజేపీ స్పష్టం చేసింది.
తానా భవన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న మంత్రి సురేశ్ రానాపై 3 కేసులు ఉన్నాయి. షుగర్ కేన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్న ఆయన రైతులకు చెరుకు బకాయి ఇప్పించేందుకు విశేషంగా కృషి చేసినందున రానాకు టికెట్ ఇచ్చినట్లు బీజేపీ ప్రకటించింది. ఇక ఫతేపూర్ నుంచి బరిలో దిగనున్న బాబూలాల్ పై 7 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండగా.. అవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టినవేనని కమలదళం అంటోంది. బుదానా అభ్యర్థి ఉమేష్ మాలిక్, ముజఫర్ నగర్ సీటు నుంచి పోటీ చేయనున్న కపిల్ దేవ్ అగర్వాల్, మీరట్ అభ్యర్థి అమిత్ అగర్వాల్ పై ఆరు చొప్పున క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారందరికీ ప్రజల్లో ఉన్న మంచి పేరు కారణంగానే టికెట్లు ఇస్తున్నట్లు బీజేపీ సమర్థించుకుంది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం రాజకీయపార్టీలు నేర చరితులకు టికెట్ కేటాయిస్తే అందుకు కారణాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బీజేపీ క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల ఎంపికకు కారణాలు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..