కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ త్వరలోనే యుద్ధం ప్రకటించబోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు రాబోతున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, అవసరం బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూల్చుకుంటారని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్ లోని మహాశక్తి ఆలయ ఆవరణలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమ్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదని విమర్శించారు. ఆ పార్టీకి గతం కంటే తక్కువ సీట్లు వచ్చాయని, కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతైందన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ నిండా మునిగిపోతున్నయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కులగణన ఫామ్స్.. పెన్సిల్తో నింపుతున్నరు
‘‘కుల గణన పెద్ద బోగస్. ఫామ్స్ పెన్సిల్ తో నింపుతున్నరు.. పెన్నుతో సంతకం తీసుకుంటున్నారు. ఎందుకంటే తరువాత కాంగ్రెస్ పార్టీ తనకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనుకుంటుంది. అందుకే ప్రజలు సహకరించడం లేదు. చాలాచోట్ల నిలదీస్తున్నారు. నేనడుగుతున్న కేసీఆర్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది కదా. ఆ రిపోర్ట్ బయటపెట్టాలి. ఆ రిపోర్ట్ లేకపోతే.. దానికైన సొమ్మంతా కేసీఆర్ నుంచి రికవరీ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.