ఫోన్లు ట్యాప్ చేసుడేంది?

ఫోన్లు ట్యాప్ చేసుడేంది?

రాజస్థాన్ ఆడియో టేపుల వివాదం.. సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య చాన్నాళ్ల నుంచి కోల్డ్ వార్
అధికార పార్టీలోనే కుట్రలు పెరిగిపోయినయ్
కాంగ్రెస్ ది ఫోన్ ట్యాపింగ్ చరిత్ర: సంబిత్ పాత

న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: రాజస్థాన్ లో ఆడియో టేపుల వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని, దీనిపై విచారణ జరపాలని బీజేపీ పట్టుబడుతోంది. ‘‘రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందా? దీనిపై సీబీఐ విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేసింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్నికూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందుకోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా పలువురు కాషాయ పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారని ఆరోపిస్తూ ఆడియో టేపు లను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. దీనిపై బీజేపీ స్పోక్స్ పర్సన్ సంబిత్ పాత్రా శనివారం ఫైర్ అయ్యారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
‘‘ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులే ఇంకా ధ్రువీకరించలేదు.. కానీ సీఎం గెహ్లాట్ సహా కాంగ్రెస్ లీడర్లు మాత్రం ఆడియో క్లిప్పులు అథెంటిక్ అని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్, గెహ్లాట్ ను కొన్ని ప్రశ్నలు మేం అడగాలనుకుంటున్నాం. ఫోన్లు ట్యాప్ చేశారా? చేశారనే అనుకుందాం.. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫాలో అయ్యారా? రాజ్యాంగ విరుద్ధమైన దారులను ఉపయోగించుకుందా? ప్రైవసీ విషయంలో ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యిందా? లేదా అనే దాన్ని రాజస్థాన్ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారా? అని అడుగుతున్నారు’’ అని సంబిత్ పాత్రా ప్రశ్నించారు. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు. గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య చాన్నాళ్ల నుంచి కోల్డ్ వార్ జరుగుతోందన్నారు. అధికార పార్టీలోనే కుట్రలు పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్ కు ఫోన్ ట్యాపింగ్ చరిత్ర ఉందని, గతంలో పి.చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు.

ఆడియో క్లిప్పుల వ్యవహారంపై ఏసీబీ కేసు
రాజస్థాన్ సర్కారును కూల్చేందుకు ప్రయత్నించారంటూ విడుదలైన ఆడియో టేపుల వ్యవహారంపై యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఫైల్‌ చేసింది. చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదుతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు ఏసీబీ డీజీ చెప్పారు. ఎఫ్ఐఆర్‌లో రెబల్ ఎమ్మెల్యే భన్వర్ లాల్, సంజయ్ జైన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లే చేర్చారు. కాగా, ఫేక్‌‌‌‌ ఆడియో టేపులతో తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీని లాగొద్దు: వసుంధర
బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజే మొత్తానికి నోరువిప్పారు. వారంరోజులుగా రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై తొలిసారి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసమ్మతికి.. ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని శనివారం ట్వీట్ చేశారు. పబ్లిక్ గురించి అధికార కాంగ్రెస్ ఆలోచించాలని సూచించారు. ‘‘కరోనా వల్ల రాజస్థాన్ లో 500 మంది చనిపోయారు. 28 వేల మందికి వైరస్ సోకింది. మిడతల దండు దాడి కొనసాగుతోంది. మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో పొలిటికల్ క్రైసిస్ నెలకొంది. ప్రజల గురించి ఆలోచించాలని అధికార కాంగ్రెస్‌ను కోరుతున్నా. ఈ బురదలోకి బీజేపీని, బీజేపీ నాయకులను లాగడంలో అర్థంలేదు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి అతి ముఖ్యమైనవిగా ఉండాలి’’ అని హితవు పలికారు.

రాష్ర్టపతి పాలన విధించండి: మాయావతి
రాజస్థాన్ లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను బీఎస్పీ చీఫ్ మాయావతి కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి బీఎస్పీని గెహ్లాట్ మోసం చేశారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా అక్రమ, రాజ్యాంగ విరుద్ధమైన పనులకు పాల్పడ్డారని మాయావతి ఆరోపించారు.

For More News..

లాగు చిన్నగా కుట్టిండని టైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కంప్లైంట్

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే

ప్లేయర్ల కోసం చార్టెడ్‌ ఫ్లైట్స్‌.. హోటల్‌ బుకింగ్స్‌!