చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ వాళ్ళను మించినవారు ఎవరూ ఉండరు. ఈ విద్యలో వారు సిద్ధహస్తులు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అవాస్తవాలను వాస్తవాలుగా చరిత్రకు వక్ర భాష్యం చెప్పేవిధంగా విష ప్రయత్నం చేస్తుంటారు. మొన్న సెప్టెంబర్ 17 రోజున విమోచన దినం పేరున బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ మాట్లాడటం కూడా మనం గమనించవచ్చు. హోం మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్మీని పంపి నిజాంను లొంగదీసుకుని హైదరాబాద్ ను ఇండియన్ రిపబ్లిక్ కిందకు తీసుకొచ్చారు.
ఈ ఘనకార్యంలో బీజేపీ వాళ్ళ పాత్ర అసలేం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు యోధుల ఆధ్వర్యంలో ప్రజలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రామానంద తీర్థ, పీవీ నరసింహారావు కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినవారు. సాయుధ పోరాట వీరులు బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ కుటుంబానికి చెందినవారే.
కొమరం భీమ్, చాకలి ఐలమ్మ సాయుధ పోరాట వీరులు. బీజేపీ వ్యతిరేక విప్లవకారుల భావజాలం కలవారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా బీజేపీ పాత్ర ఎక్కడుందో తెలువదు. వారి భాగస్వామ్యం కూడా లేదు. చరిత్రతో పాటు అధికారిక పత్రాల్లో ఎక్కడా కూడా వీరి పాత్ర ఉన్నట్లు రుజువులు లేవు. కనిపించవు. అయినా కూడా వీరు ఎందుకోసం విలీన దినోత్సవాన్ని తెలంగాణ విమోచన దినం అనే పేరుతో ఒక వితండవాదం ముందుకు తెచ్చి సంబురాలను జరపాలని ఎందుకు పట్టుబడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.
గుజరాత్ లోని జునాగడ్ సంస్థానం 1947లో సెప్టెంబర్ 15వ తేదీన, కాశ్మీర్ సంస్థానం అక్టోబర్ 26వ తేదీన భారత రిపబ్లిక్ లో విలీనం అయినాయి. ఈ చోట్లల్లో విమోచన దినోత్సవాలు చేస్తామని బీజేపీ చెప్పకుండా రెండు నాల్కల దొంగ నాటకం ఆడుతున్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరి పాత్ర గుండు సున్న మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో కూడా బీజేపీ భాగస్వామ్యం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. బీజేపీ నేత కిషన్ రెడ్డి కనీసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకు తిరిగారు.
ప్రధాని మోదీ.. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచిన అంశాన్ని ప్రజలు అంత తేలికగా మర్చిపోరు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా జరగలేదని మాట్లాడడాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నేత బండి సంజయ్ నామమాత్రంగా అయినా ఎక్కడా పాల్గొనలేదు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ అభూత కల్పనలు
బీజేపీ, ఆర్ఎస్ఎస్ తిమ్మిని బమ్మిని చేస్తూ అభూత కల్పనలతో కొత్త చరిత్రను సమాజం మీద రుద్దే ప్రయత్నం చేయడం అత్యంత జుగుప్సాకరం.1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ భారత స్వాతంత్ర్య సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు అసలే లేవు. నాడు ఆర్ఎస్ఎస్ ఫౌండర్ కేశవ్ బలరాం హెగ్డేవార్ గురించి సీపీ బిషికర్ అనే రచయిత ఆయన జీవిత చరిత్రపై ఒక పుస్తకం ప్రచురించారు.
దీంట్లో ఆయన సంఘ్ సత్యాగ్రహంలో భాగస్వామ్యం కావొద్దని నిర్ణయం తీసుకుందని రాశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ దూరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ ఎక్కడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆనవాళ్లు లేవు. భారతదేశం చరిత్ర ఒకలాగ ఉంటే బీజేపీ దాన్ని వక్రీకరించేందుకు తప్పుడు మార్గం ఎంచుకోవడంతో నే వారి వైఖరి బయటపడుతున్నది. పూర్ణ స్వరాజ్ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే అవకాశాన్ని తృణప్రాయంగా త్యజించింది.
అప్పట్లో బెంగాల్, సింధ్, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో బ్రిటిష్ వారు ఆఫర్ చేసిన ప్రభుత్వ అవకాశాన్ని కాంగ్రెస్ బహిష్కరిస్తే, 1949లో వీర్ సావర్కర్ ఇందుకోసం ఇతోధికంగా సహకరించారు. బ్రిటిష్ మద్దతుతో ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు వీర్ సావర్కర్ ఎంతో సహకరించారు. ఇది జగమెరిగిన సత్యం. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈ అంశాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో బీజేపీ పెద్దలు నేటి తరానికి సమాధానం ఇవ్వాలి.
పటేల్ స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది
జనవరి 11వ తేదీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వారు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఐ అండ్ బీ మంత్రిత్వశాఖ వారు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ పొంతన లేకుండా ఉంది. 1857లో మొదటి స్వాతంత్ర్యం యుద్ధం రమణ మహర్షి, స్వామి వివేకానంద స్ఫూర్తితో జరిగిందని అందులో చెప్పడం అత్యంత హాస్యాస్పదం. స్వామి వివేకానంద 1863లో జన్మించారు. రమణ మహర్షి 1879లో జన్మించారు.
వీరి పుట్టుక కన్నా ముందే 1857లో వీరి స్ఫూర్తితో మొదటి స్వాతంత్ర్య యుద్ధం ఎలా జరిగిందో ఈ బీజేపీ పిట్టల దొరలు తేల్చి చెప్పాలి. బీజేపీ వారు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వారసత్వం మాదేనని పగిలిన కుండ బద్దలు కొడతారు. పటేల్ స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది. తన జీవితకాలమంతా కాంగ్రెస్ లోనే గడిపారు. కాంగ్రెస్ డిప్యూటీ ప్రధాన మంత్రిగా, హోం మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థను దేశంలోనే రద్దు చేశారు. శివాజీ లాంటి సామాజికంగా ప్రగతిశీల గుణాన్ని ఒంట బట్టించుకోరు. ఆ మహా యోధుడి 35 ఫీట్ల ఎత్తున్న విగ్రహాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఆవిష్కరించారు.
ఆ విగ్రహం 9 నెలల్లోనే కుప్పకూలేలా నిర్మించిన ఘనత బీజేపీ వాళ్ళకు దక్కుతుంది. నెహ్రూ సార్వత్రికవాదానికి, గాంధీ సత్యాగ్రహానికి, స్వరాజ్య పోరాటానికి, శ్రీరామచంద్ర మూర్తి సత్యశీలతకు వీరు వ్యతిరేకం, శ్రీ అరబిందో సమసమానతకు, అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలన, రిజర్వేషన్ల రక్షణకు వీరు వ్యతిరేకం. ఈ బీజేపీ నేతలు మహానీయులందరినీ సమయాను కూలంగా పొగుడుతుంటారు.
నేటి తరానికి అసలు చరిత్ర తెలియజేయకుండా తెరవేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజం ఎప్పుడూ నిప్పులాగే ఉంటుంది.. అది తెలుసుకొని మసలుకోవాలి బీజేపీ నేతలు.. లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
అమరవీరుల గురించి మాట్లాడని ఆర్ఎస్ఎస్
ఆర్ఎస్ఎస్ కి సంబంధించి నాటి దాని అనుబంధ సంఘాల నియామకం బ్రిటిష్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగిందని చరిత్రకారులు చెప్పడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మా ఆలోచనలే పుణికి పుచ్చుకున్నారని అత్యంత నిస్సిగ్గుగా బీజేపీ నాయకులు చెప్పుకోవడం దారుణం. ఈ పార్టీ నేతలు అసలు విషయం తెలుసుకోవాలి. నేతాజీ ఇండియాను మిలిటరీ పోరాటం ద్వారా సాధించాలని అనుకున్నాడు.
ఆ దిశగా బ్రిటిష్ వాళ్ళపై పోరాటం నిర్వహించాడు. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిష్ వాళ్లకు మిలిటరీ రిక్రూట్మెంట్ క్యాంపులు నిర్వహించారని చరిత్ర చెబుతున్నది. నేతాజీ ఆయన నెలకొల్పిన ఆజాద్ హిందూ ఫౌజ్ లో గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్, ఆజాద్ బ్రిగేడ్, రాణి లక్ష్మీబాయి బ్రిగేడ్ అనే బ్రిగేడ్ లు ఏర్పాటు చేశారు తప్ప వీర్ సావర్కర్ బ్రిగేడ్ కానీ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ బ్రిగేడ్ అని ఈ ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్లు పెట్టలేదు.
నేతాజీ లెఫ్టిస్ట్, సోషలిస్టు అని ప్రపంచమంతా తెలుసు. అలా కాక ప్రజల చెవుల్లో పూలు పెడుతూ నేతాజీ మా వాడే అని బీజేపీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు. ముస్లిం లీగ్, అప్పటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ హెచ్ఎంఎస్ మతపరమైన సంస్థలు అని నేతాజీ ఆనాడే చెప్పారు. ఈ నిజాన్ని చెరిపేసేందుకు నేతాజీ మా వైపే ఉన్నారని బీజేపీ నాయకులు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి అమరవీరుల గురించి ఒక్క మాట కూడా ఆర్ఎస్ఎస్ ఉచ్చరించలేదు.
- వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్