నిర్మల్, వెలుగు : నిర్మల్ పట్టణంలోని గొలుసుకట్టు చెరువుల భూముల ఆక్రమణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. చెరువుల భూముల ఆక్రమణలను నిరోధించేందుకు బీజేపీ చేపట్టిన చెరువుకు దరువు–వరదకు అడ్డు అనే కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ నాయకులు పట్టణంలోని గొలుసుకట్టు చెరువులైన ఇబ్రహీం చెరువు, మజాలాపూర్ రాంసాగర్ చెరువులను సందర్శించారు.
జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ రెడ్డి, మెడిసమ్మ రాజు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఇక్కడి గొలుసుకట్టు చెరువుల అస్తిత్వాన్ని తెలిపేందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చెరువుల భూములను కొంత మంది రియల్టర్లు ఆక్రమిస్తూ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆక్రమణలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు.
మరో వారం రోజులపాటు మిగతా చెరువు భూములను సందర్శించి ఆక్రమణలు గుర్తిస్తామన్నారు. ఆ తర్వాత కలెక్టర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు అలివేలుమంగ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజినీ వైద్య, నాయకులు శ్రావణ్ రెడ్డి, రాచకొండ సాగర్, అర్జున్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.