
- రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న లీడర్లు
- ఖమ్మంలో కమ్మ వర్సెస్ బీసీ గల్లాపై వేటు తప్పదని ఇప్పటికే సంకేతాలు
- భద్రాద్రిలో ప్రస్తుత అధ్యక్షుడితో పాటు మరో ఏడుగురు ప్రయత్నాలు
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుల పదవుల రాజకీయం వేడెక్కుతోంది. జిల్లా అధ్యక్షులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండడంతో ఆశావాహులు పావులు కదుపుతున్నారు. పదవి దక్కించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర, జాతీయ స్థాయి ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తూ పైరవీలు చేస్తున్నారు.
తుది దశకు ఖమ్మం అధ్యక్షుడి ఎంపిక ?
ఖమ్మంలో బీసీ వర్సెస్ కమ్మ ఈక్వేషన్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గల్లా సత్యనారాయణ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కాగా మరోసారి తనకే పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయనను మార్చాలని హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పదవిని ఆశిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన జిల్లా అధ్యక్ష పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చినందున ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికే చాన్స్ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కమ్మ సామాజికవర్గం నుంచి నున్నా రవికుమార్, చావా కిరణ్, నెల్లూరి కోటేశ్వరరావు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. బీసీ కమ్యూనిటీ నుంచి డాక్టర్ శీలం పాపారావు, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ రేసులో ఉండగా, మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కూడా తనకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలం అంతంతే...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక కార్పొరేటర్‌ను మాత్రమే గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరు క్యాండిడేట్లు డిపాజిట్లు కోల్పోయారు. అయితే అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. ఇన్నేళ్లుగా ఒకటిన్నర శాతం లోపు ఓట్లు మాత్రమే సాధిస్తున్న సెగ్మెంట్‌లో ఈ సారి 9.48 శాతం ఓట్లు వచ్చాయి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 20,488 (1.8శాతం) ఓట్లు రాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకొని పోటీ చేయగా అన్ని సెగ్మెంట్లు కలిపి 16,696 (1.2శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 1,18,636 (9.48 శాతం) ఓట్లను సాధించింది. అర్బన్ ప్రాంతాల్లో యూత్ ఓటర్లు పార్టీ పట్ల ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు బలమైన పోటీని ఇస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుల మార్పు జరుగుతుండడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు పోటీ పెరిగింది. బీజేపీలో జిల్లా అధ్యక్షుల పదవి కాలం మూడేళ్లు ఉంటుంది.
జమిలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా, సాధారణంగానే రాష్ట్రంలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ప్రస్తుతం కాబోతున్న అధ్యక్షుడే ఎన్నికల సమయంలో బాధ్యతల్లో ఉండే అవకాశం ఉండడం కూడా పోటీని పెంచింది. అయితే ఉమ్మడి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సహ ఇన్‌చార్జిగా, పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇక కొండపల్లి శ్రీధర్‌రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి ఆశీస్సులు ఉన్న వారికే పదవులు దక్కే అవకాశం ఉంది.
భద్రాద్రిలో ముమ్మరంగా ప్రయత్నాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేతలంతా జిల్లా అధ్యక్ష పదవిపై దృష్టి పెట్టారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కేవీ.రంగా కిరణ్‌తో పాటు మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాళ్ల సోమసుందర్, యడ్లపల్లి శ్రీనివాస్, సీతారాం నాయక్, పోడియం బాలరాజు, ఎ. శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగుల వెంకట్‌రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు కొంతకాలంగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ బాధ్యతలు చేపట్టి ఏడాదే కావడంతో మళ్లీ తనకే అవకాశం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడితో పాటు పదవిని ఆశిస్తున్న పలువురు నేతలు ఇటీవల ఒకరిపై మరొకరు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధిష్ఠానం ఇరు పక్షాలతో చర్చించడంతో పాటు విచారణ సైతం నిర్వహించింది. ప్రస్తుతం ఎవరికి వారు గుట్టుచప్పుడు కాకుండా తమకున్న పరిచయాలతో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను కలుసుకుంటూ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్, వెలుగు : ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధన వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు గంట ముందుగానే ఎగ్జామ్సెంటర్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికారులు పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. తాగునీరు, విద్యుత్, ఫర్నీచర్, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియెట్ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఇప్పటికే కలెక్టర్లు రివ్యూలు నిర్వహించి పలు సూచనలు చేశారు.
పరీక్షలకు 54,607 మంది విద్యార్థులు
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలుపుకొని ఉమ్మడి జిల్లాలో మొత్తం 54,607 మంది విద్యార్థులున్నారు. మొత్తం 96 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ కాలేజీలు, సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫస్టియర్ జనరల్‌విద్యార్థులు 8093 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1013 మంది, సెకండియర్‌లో జనరల్‌లో 8754, ఒకేషన్లో 1020 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్టియర్‌లో 4,965 మంది జనరల్, 935 ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. సెకండియర్‌లో 5,625 మంది జనరల్, 1015 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నిర్మల్ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్టియర్ లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 6, 571 మంది, సెకండియర్‌లో 6562 మంది విద్యార్థులున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్టియర్‌లో 4,758 మంది, సెకండియర్‌లో 5,296 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.
సదుపాయాలపై ఫోకస్
పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రూరల్ విద్యార్థులకు ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా వారికి వీలుగా బస్సులు నడిపించాలని సూచించారు. ఎగ్జామ్ జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, వేసవి నేపథ్యంలో ఉక్కపోత సమస్య అధిగమించేలా గదుల్లోని అన్ని ఫ్యాన్లు పనిచేసేలా రిపేర్లు చేపట్టారు. సెంటర్ల వద్ద వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు పెట్టాలని.. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పరీక్ష కేంద్రాల వద్ద ఉండి ఫస్టెయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు.
క్యూఆర్ కోడ్‌తో సెంటర్ లొకేషన్, వివరాలు
పరీక్షల సమయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల పేరిట వేధిస్తూ హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుంటాయి. దీంతో పలువురు విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు షాక్ ఇస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్లకు ఓటీపీ పంపనున్నారు. ఈ ఓటీపీ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఇంటర్ బోర్డు మొదటిసారిగా హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం వివరాలు, లొకేషన్
కనిపిస్తాయి.