ఢిల్లీలో దుమ్మురేపుతోన్న బీజేపీ.. ఎర్లీ ట్రెండ్స్‎లో మేజిక్ ఫిగర్ క్రాస్

ఢిల్లీలో దుమ్మురేపుతోన్న బీజేపీ.. ఎర్లీ ట్రెండ్స్‎లో మేజిక్ ఫిగర్ క్రాస్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా కమలం పార్టీ అధిక్యంలో దూసుకుపోతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూకుడు చూపించిన బీజేపీ.. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ అధిపత్యం చెలాయిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్‎లో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (36 సీట్లు)ను బీజేపీ దాటేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 38 చోట్ల బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ ఒక్క చోట అధిక్యం కనబరుస్తోంది. 

ఆప్ అగ్రనేతలు వెనుకంజలో పడిపోయారు. కేజ్రీవాల్, సీఎం అతిశీ, మనీష్ సిసోడియా ముగ్గురు టాప్ లీడర్స్ ఎదురీదుతున్నారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ లీడింగ్ లో ఉండగా.. అతిశీపై రమేష్ బిధూరు అధిక్యం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ సెగ్మెంట్లో వెనకబడ్డారు. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ.. ఈ సారి దుమ్మురేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటిన కమలం పార్టీ.. భారీ అధిక్యం దిశగా దూసుకుపోతుంది. 

వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించిన ఆప్‎కు ఈ సారి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ అగ్రనేతలు కూడా వెనకంజలో ఉండటం గమనార్హం. ఇక, పునర్ వైభవాన్ని చాటుకోవాలని ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ కు మరోసారి నిరాశే ఎదురు అవుతోంది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కనీస పోటీలో కూడా లేదు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్ స్వల్ప అధిక్యంలో ఉన్నారు. శనివారం (ఫిబ్రవరి 8) మధ్యాహ్నం వరకు కౌన్ బనేగా ఢిల్లీ బాద్ షా అనేది తేలిపోనుంది.