ఆదిలాబాద్‌‌‌‌లో కమలం డీలా... బీజేపీని వీడుతున్న కీలక నేతలు

  •     క్యాండిడేట్‌‌‌‌ ప్రకటన తర్వాత లీడర్లలో అసంతృప్తి
  •     కాంగ్రెస్‌‌‌‌లో చేరిన బాపురావు, బీఆర్​ఎస్​లోకి జనార్దన్‌‌‌‌
  •     టికెట్‌‌‌‌ ఆశించి భంగపడిన నేతలు సైలెంట్‌‌‌‌

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ రోజురోజుకు డీలా పడుతోంది. ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో సిట్టింగ్‌‌‌‌ స్థానాన్ని కాపాడుకోవడం ఆ పార్టీకి కత్తిమీద సాములా మారింది. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో లీడర్లు దూరం కావడం వల్ల పార్టీకి భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. 

ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ ప్రకటన తర్వాతే..

అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ నేతలంతా ఒక్కటిగానే పనిచేశారు. కానీ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ను ప్రకటించిన తర్వాతే ఆ పార్టీ నేతల్లో గొడవలు మొదలయ్యాయి. అసంతృప్తిలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ కీలక నేతలు, అది కూడా లంబాడీ సామాజికవర్గానికి చెందిన లీడర్లు పార్టీ  మారడంతో గట్టి దెబ్బ తగిలినట్లైంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోమవారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ లో చేరగా, జడ్పీ చైర్మన్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ జనార్దన్‌‌‌‌ మంగళవారం కేటీఆర్‌‌‌‌ సమక్షంలో బీఆర్ఎస్‌‌‌‌లో చేరారు. వీరిద్దరు కూడా బీజేపీ నుంచి ఎంపీ టికెట్‌‌‌‌ ఆశించారు. రాథోడ్‌‌‌‌ జనార్ధన్‌‌‌‌ ఖానాపూర్‌‌‌‌ నియోజకవర్గంలో, బాపురావు బోథ్ నియోజకవర్గంలో ప్రభావం చూపనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సిట్టింగ్‌‌‌‌ స్థానం నిలబెట్టుకునేనా ?

ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో తొలిసారి 2019లో బీజేపీ క్యాండిడేట్‌‌‌‌ సోయం బాపురావు ఎంపీగా గెలిచారు. అప్పుడున్న ఆదివాసీ ఉద్యమంతో నరేంద్ర మోదీ మేనియాతో బీజేపీ విజయం సాధించగలిగింది. కానీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ నాలు గు స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో పార్లమెంట్‌‌‌‌ పరిధిలో ఆ పార్టీ బలం పెరిగింది. అయితే పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్‌‌‌‌ తీసుకున్న నిర్ణయం పార్టీలో అంతర్గత గొడవలకు దారితీసింది.

 సిట్టింగ్‌‌‌‌ ఎంపీకి గానీ, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి గానీ టికెట్‌‌‌‌ ఇవ్వకుండా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇవ్వడంతో సీనియర్లంతా అసంతృప్తితో ఉన్నారు. ఓ వైపు కాంగ్రెస్‌‌‌‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం, మరో వైపు సొంత పార్టీలోనే లీడర్ల మధ్య విభేదాల కారణంగా సిట్టింగ్‌‌‌‌ స్థానాన్ని కాపాడుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమించాల్సి ఉందని పలువురు అంటున్నారు. 

సొంత ఇలాఖాలో నగేశ్‌‌‌‌కు ఎదురీత

బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ సొంత నియోజకవర్గం బోథ్‌‌‌‌లోనే రోజుకో వివాదం జరుగుతోంది. వారం రోజుల క్రితం గుడిహత్నూర్, బజార్‌‌‌‌హత్నూర్, నేరడిగొండ, బోథ్ మండలాల అధ్యక్షులను మార్చడంతో పలువురు సీనియర్ లీడర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ సోయం బాపురావు సైతం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ బూత్‌‌‌‌స్థాయి సమావేశానికి సైతం ఆయన హాజరుకాలేదు. 

తాజాగా అదే నియోజకవర్గ నేత మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌‌‌‌ బాపురావు సైతం పార్టీని వీడడంతో నగేశ్‌‌‌‌కు సొంత ఇలాఖాలో ఎదురీత తప్పడం లేదు. అటు టికెట్ ఆశించి నిరాశకు గురైన మాజీ ఎంపీ, ఖానాపూర్‌‌‌‌ నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న  రాథోడ్ రమేశ్ సైతం సైలెంట్‌‌‌‌ అయ్యారు. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడంతో ప్రచార బాధ్యత మొత్తం ఆదిలాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే పాయల్‌‌‌‌ శంకర్‌‌‌‌పై పడింది.