మూడు సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

  • స్పీకర్​పై బరిలో యెండల లక్ష్మీనారాయణ 

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు:​ మొదటి లిస్ట్​లో ఉమ్మడి జిల్లాలోని అయిదు సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ గురువారం మరో ముగ్గురు అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనలయ్యారు. బాన్సువాడ నియోజకవర్గంలో  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డిపై యెండల లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. ఈయన నిజామాబాద్​ మాజీ ఎమ్మెల్యే. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జిగా ఉన్న మల్యాద్రిరెడ్డి మూడు రోజులకింద కాంగ్రెస్​లో చేరారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ యెండల వైపు మొగ్గుచూపింది. బోధన్​ నుంచి వడ్డీ మోహన్​రెడ్డి, నిజామాబాద్​ రూరల్​ నుంచి దినేశ్​ కులాచారి బరిలో నిలువనున్నారు. బోధన్​లో మేడపాటి ప్రకాశ్​రెడ్డి, మోహన్​రెడ్డి మధ్య టికెట్​ కోసం పోటీ నడిచింది. హైకమాండ్​ చివరకు మోహన్​రెడ్డి వైపు మొగ్గుచూపింది. నవీపేట మండలానికి ఈయన గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, నిజామాబాద్​సహకార చక్కెర మిల్లు చైర్మన్​గా పనిచేశారు.

ALSO READ : మాయ మాటలకు మోసపోవద్దు : రోహిత్

ప్రస్తుతం రైస్​ మిల్లర్ల సంఘం స్టేట్​జనరల్​ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి పోటీచేస్తారని భావించినప్పటికీ, ఆయన ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్​ టికెట్​ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు ఎల్లారెడ్డి టికెట్​ఇస్తారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఇంకా పెండింగ్ లో  ​పెట్టారు.