రాజ్యాంగం బుక్‎లో ఖాళీ పేజీలు..! కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

రాజ్యాంగం బుక్‎లో ఖాళీ పేజీలు..! కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ నేతలు ఖాళీ పేజీలతో కూడిన రాజ్యాంగం కాపీలను పంచారంటూ బీజేపీ మండిపడింది. గురువారం నాగ్‌పూర్‌లో రాహుల్  హాజరైన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఖాళీ రాజ్యాంగం కాపీలను పంపిణీ చేశారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మహారాష్ట్ర బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. మొదటి పేజీలోని ఉపోద్ఘాతం మినహా మిగిలిన అన్ని పేజీలు ఖాళీగా ఉన్నట్టు ఆ ఫొటోలు, వీడియోల్లో కనిపించింది. 

దీంతో  రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఇలా తుడిచివేయాలని అనుకుంటోందని బీజేపీ ఆరోపించింది. అలాగే, ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ తీసుకెళ్లిన రాజ్యాంగం కాపీ రంగు కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. రాహుల్ చేతిలో ఉన్నది రాజ్యాంగం కాదని, అది రెడ్ బుక్ అని ధ్వజమెత్తారు. అర్బన్‌ నక్సల్స్‌, అరాచకవాదుల మద్దతు కోసం రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై ఎదురుదాడి చేసింది.

 బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, రాహుల్ తీసుకెళ్లింది రాజ్యాంగం కాపీయేనని స్పష్టం చేసింది. కాగా, బ్రిటిష్ వారి నుంచి రాజులు, నవాబులు లంచాలు తీసుకున్నారన్న రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య, కిరణ్ రిజిజు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి, ఇతర రాజ వంశీయులు మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని, గొప్ప వారసత్వాన్ని అవమానించడమేనని వారు విమర్శించారు.