ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్.. సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం

ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్.. సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షాలిమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ 9వ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖాగుప్తాతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

సుష్మా స్వరాజ్(బీజేపీ), షీలా దీక్షిత్(కాంగ్రెస్‌‌), అతిశీ(ఆప్) తర్వాత రేఖా గుప్తా ఢిల్లీ నాల్గవ మహిళా ముఖ్యమంత్రిగా నిలిచారు. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా(50)ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి  బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకున్నారు.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రాజకీయ ప్రస్థానం..

రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌‌గఢ్ గ్రామంలో 1974 జూలై 19 జన్మించారు. ఆమె  తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. రేఖా గుప్తా రెండేండ్ల వయసు(1976)లో వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పుడే రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. 1996 నుంచి-1997 మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్ యూ) అధ్యక్షురాలిగా పనిచేశారు. రేఖా గుప్తా రాజకీయ జీవితం 2000లో  ప్రారంభమైంది.

2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎమ్)లో చేరి ఢిల్లీ యూనిట్‌‌లో కార్యదర్శిగా పనిచేసి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2007లో  కౌన్సిలర్‌‌గా ఎన్నికయ్యారు. 2009 వరకు ఎమ్ సీడీలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. 2015, 2020లో ఢిల్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ స్థానానికి పోటీ చేశారు. కానీ రెండు సార్లు ఆప్ అభ్యర్థి బందన కుమారి చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ షాలిమార్ బాగ్ నుంచి పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29 వేల ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఢిల్లీ సీఎం పదవిని దక్కించుకున్నారు.