
- చేయని పనులను చేసినట్లు చెప్పించారు: బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్‌గా ఉంటుందని ఆశించామని, ఆయన ప్రసంగమంతా పూర్తి డొల్ల అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులను కూడా చేసినట్లుగా గవర్నర్ ప్రసంగంలో చెప్పారన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందనేది అవాస్తవమన్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
కేంద్రం నుంచి నిధులు తీసుకురండి: పొన్నం
దేశంలో ఉత్తరాది రాష్ట్రాలపై ఒకలా.. ఇతర రాష్ట్రాలపై మరోలా కేంద్ర ప్రభుత్వం తీరు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మిత్రపక్షం అయిన ఏపీకి ఇస్తున్న నిధులు ఎంత? తెలంగాణకు ఇస్తున్న నిధులెంత? అని ప్రశ్నించారు. తెలంగాణకు ఇస్తున్న నిధులపై బీజేపీ నాయకత్వాన్ని ఆ పార్టీ ఎంపీలు ప్రశ్నించాల్సింది పోయి సమర్థించుకుంటారా అని మండిపడ్డారు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.