ఫామ్​హౌస్ పై ఎందుకంత ప్రేమ .. కేటీఆర్​ను ప్రశ్నించిన ఏలేటి

ఫామ్​హౌస్ పై ఎందుకంత ప్రేమ .. కేటీఆర్​ను ప్రశ్నించిన ఏలేటి

హైదరాబాద్, వెలుగు: జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ కు ఎందుకంత ప్రేమ అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘హైడ్రా అధికారులు ఇటీవల గండిపేట ఎఫ్ టీఎల్ లోని నిర్మాణాలు కూల్చివేశారు. మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలను నేలమట్టం చేశారు. మరి అప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. వాటిపై లేని ప్రేమ, ఆందోళన ఈ జన్వాడ ఫామ్ హౌస్ పై ఎందుకు?” అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. గత 20 ఏండ్లలోనే హైదరాబాద్ లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారు. 

2014లో కేసీఆర్ సీఎం అయిన కొత్తలో హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు కొన్నింటిని కూల్చివేశారు. రెండు మూడ్రోజులు కొనసాగిన కూల్చివేతలు.. ఆ తర్వాత ఆగిపోయాయి. ఆ తర్వాత కొద్ది నెలలకు గ్రేటర్ లోని టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా కేసీఆర్ బాటలో నడుస్తున్నారా? లేక సీరియస్ గా హైడ్రాకు స్వేచ్ఛ ఇచ్చారా?” అని ప్రశ్నించారు.  ‘‘హైదరాబాద్​లోని 134 చెరువుల్లో ఎఫ్ టీఎల్ పరిధిలో 8,718 నిర్మాణాలు జరగ్గా.. బఫర్ జోన్ పరిధిలో 5,343 నిర్మాణాలు జరిగినట్టు అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. మరి వాటన్నింటిపై చర్యలు తీసుకోగలరా?” అని ప్రశ్నించారు.