భువనగిరిపై బీజేపీ ఫోకస్!

  • ఎంపీ అభ్యర్థిత్వంపై పార్టీ అభిప్రాయ సేకరణ            
  • టికెట్‌‌‌‌ కోసం పోటీ పడుతున్న నలుగురు లీడర్లు

యాదాద్రి, వెలుగు: పార్లమెంట్​ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌‌‌‌ పెట్టింది. ఇందులో భాగంగా భువనగిరి పార్లమెంట్‌‌‌‌ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ మేరకు స్టేట్‌‌‌‌ లీడర్లు పార్లమెంట్​పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో మీటింగులు పెడుతున్నారు.

కాగా, ఈ స్థానం నుంచి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్​ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ పోటీ పడుతున్నారు. వీరు నలుగురు స్టేట్, ఢిల్లీ స్థాయిలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి టికెట్​ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇటీవల భువనగిరిలో మీటింగ్‌‌‌‌

నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్​కు భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్​, తుంగతుర్తి, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 300 మంది ఆఫీసు బేరర్లు వచ్చారు. అభిప్రాయాలను సేకరించడానికి బీజేపీ స్టేట్​ ఉప కోశాధికారి  శ్రీనివాసరెడ్డి, స్టేట్​ సెక్రటరీ ఆకుల విజయ వచ్చారు.

మీటింగ్​కు వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి ఎవరి పేరును ప్రస్తావించకుండా అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలో సూచించాలని కోరారు. ఒక పేరు సూచించిన ఆఫీసు బేరర్‌‌‌‌‌‌‌‌ను మరో పేరు కూడా సూచించమని కోరారు. అయితే కొందరు ఒకపేరే సూచించగా, మరికొందరు రెండు పేర్లు చెప్పినట్లు తెలిసింది. అందరి అభిప్రాయాలను సేకరించిన స్టేట్​లీడర్లు.. వాటిని స్టేట్​ కమిటీకి అందజేశారు. 

నలుగురిలో ఎవరి బలమెంత..?

టికెట్​కోసం పోటీ పడుతున్న నలుగురిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఒక్కరే పార్టీకి కొత్త. మునుగోడు  ఉప ఎన్నికల సమయంలో ఆయన బీఆర్​ఎస్​ను వీడి బీజేపీలోకి వచ్చారు. బీసీల్లో బలమైన కులానికి చెందిన నేత కావడంతో టికెట్‌‌‌‌ కోసం గట్టిగానే కొట్లాడుతున్నారు.  ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే జిల్లాకు ఎయిమ్స్​ వచ్చింది.  

గత ఎనిమిదేండ్లుగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన  పీవీ శ్యాంసుందర్​రావు గత పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీ చేసి 60 వేలకు పైగా ఓట్లు సాధించారు. వివాదరహితుడు కావడంతో ఆయనకు జిల్లాలోని 17 మండలాల్లో కేడర్​కు సుపరిచితమైన వ్యక్తిగా పేరుంది. ఇక ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ నేపథ్యం ఉన్న పార్టీ స్టేట్​ జనరల్​ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్​ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు.

వీరిద్దరు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆలేరు, మునుగోడు నుంచి పలుమార్లు పార్టీ తరఫున పోటీ చేశారు. కాసం వెంకటేశ్వర్లు కూడా మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన లీడర్. ఆయనకు పార్టీ రాష్ట్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్నాయి.  ఈ నలుగురిలో పార్టీ ఎవరికి టికెట్​ ఇచ్చినా పని చేయడానికి కేడర్​ సిద్ధంగానే ఉంది. అయితే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసే వారినే ఎంపిక చేసే అవకాశముందని కొందరు నేతలు చెబుతున్నారు.