ఇక మమత వంతేనా?

దేశంలో ప్రతి పక్షాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తిగా బలహీనమైపోతున్నాయి. బీజేపీ ఒక్కో రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకుంటూ, అధికారాన్ని సొంతం చేసుకుంటోంది. అమరీందర్ సింగ్, నవీన్ పట్నాయక్ లాంటి పవర్​ఫుల్ నేతలు ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా చోట బీజేపీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు పదేండ్లుగా పశ్చిమ బెంగాల్‌‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. దీదీ అధికారాన్ని కోల్పోతారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు కానీ, ఓటమి భయం మాత్రం ఆమెలో ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఒక యూనిటీ గానీ, పక్కా ప్లానింగ్ గానీ లేకపోవడం వల్ల ప్రధానంగా బీజేపీయేతర పార్టీలు ఒక్కొక్కటిగా వీక్ అవుతున్నాయి.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీలోని ఒక పవర్​ఫుల్ ఫైటర్ ఆమెను పశ్చిమ బెంగాల్ సీఎం కుర్చీ ఎక్కించింది. ఆమెలో ఉన్న ఆ యోధురాలు.. తనను ఎవరూ ఓడించలేరన్నంత శక్తిమంతంగా ప్రొజెక్ట్ చేసేది. ఆ పవరే ఆమె వ్యతిరేక శక్తులను బలహీనపరిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా రివర్స్‌‌లో కనిపిస్తోంది. ఆమె పూర్తిగా ఒంటరైపోయి, ప్రతిపక్షాలను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్‌‌లో చాలా వీక్‌‌గా ఉన్న బీజేపీని చూసి ఆమె ఇప్పుడు భయపడుతున్నారు. దీదీ క్యాంపెయినింగ్ తీరును చూస్తే ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమె టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతున్నప్పటికీ ఓటమి భయం స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఎదుర్కొని నిలవగలమా? లేదా అన్న ఆందోళన మమతలో ఉంది. తృణమూల్ పార్టీ భారీ ఓటమిని చవిచూడకపోయినా, ఆ పార్టీ సీట్లు గతంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గడం ఖాయం.

స్ట్రాటజీ లేకుండా బరిలో దిగిన  ఇతర పార్టీలు
పశ్చిమ బెంగాల్‌‌లో ఎన్నికలు మొదలవ్వక ముందు నరేంద్ర మోడీ – అమిత్ షాల జోడీని ఈజీగా ఎదుర్కోగలనని దీదీ భావించారు. కానీ ఆమె అంచనాలు తిరగబడ్డాయి. దశల వారీగా ప్రచారం సాగుతున్న కొద్దీ ఎవరి బలం ఏంటన్నది బయటపడుతోంది. పదేండ్లుగా అధికారంలో ఉన్న ఆమెపై ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందన్న విషయాన్ని మమతా బెనర్జీ తేలిగ్గా తీసుకున్నారు. ఇటువంటి సమయంలో బలమైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మద్దతు తీసుకుని ఉంటే కొంత వరకూ తృణమూల్‌‌కు కలిసొచ్చేది. కానీ ఈ విషయంలో దీదీ ఫెయిల్ అయ్యారు.  తన మేజిక్ పని చేసి, మోడీ‌‌‌‌–షాలను అవలీలగా ఫేస్ చేయొచ్చని ఆమె అనుకున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లాంటి నేతలు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌‌లో వారి ప్రభావం అంతంత మాత్రమే. ఇతర ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కూడా కూడగట్టుకుంటే బీజేపీని ఎదుర్కోవడంలో మరికొంత బలం పెరిగేదేమో. అయితే బెంగాల్‌‌లో వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండడంతో బీజేపీయేతర పక్షాల్లో యూనిటీ లేకుండా పోయింది. ఎటువంటి స్ట్రాటజీ లేకుండా ఎన్నికల బరిలోకి దిగడమే ఆ పార్టీల ఫస్ట్ ఫెయిల్యూర్. ఆయా పార్టీల అనాలోచిత నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది చెప్పడానికి ఇదో నిదర్శనం.

కాంగ్రెస్‌‌కు ఏ రాష్ట్రంలోనూ చాన్స్‌‌ లేదు
ప్రధాని నరేంద్ర మోడీ తన ఎజెండాను ఎప్పుడూ ఓపెన్‌‌గానే చెబుతూ వస్తున్నారు. దేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడమే తన లక్ష్యమని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. 134 ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌‌ను కేంద్రంలో అధికారం నుంచి దూరం చేసిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో ఓడిస్తూ తన టార్గెట్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ ఒక్క చోటా కాంగ్రెస్ పెద్దగా బలంగా లేదు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌‌లో ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమే. ఇంక తమిళనాడులో పొత్తు పెట్టుకున్న  డీఎంకే గెలిచే అవకాశం ఉన్నా అందులో కాంగ్రెస్ పార్టీ ప్రభావం దాదాపుగా లేదనే చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రజలకు దూరమైపోవడానికి ఒక రకంగా ఆ పార్టీ అసమర్థత, నిబద్ధత గల నాయకత్వం లేకపోవడమే ప్రధాన కారణాలు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకూ బీజేపీకి ప్లస్!
2014, 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యాక, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న తమ ప్రభుత్వాలను మళ్లీ నిలబెట్టుకోలేకపోయింది. లోక్‌‌సభలో 42 ఎంపీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌‌ను బీజేపీ చాలెంజింగ్‌‌గా తీసుకుంది. ఈ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 200 సీట్లు గెలవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ప్రస్తుతం కేవలం రెండు సీట్లతో ఉన్న ఆ పార్టీ 100 దాటి ఎన్ని సీట్లలో గెలిచినా అది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవుతుంది. అయితే బీజేపీ మాత్రం బెంగాల్‌‌లో అధికారం తమదే అన్న ధీమాతో కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఏపీ, ఒరిస్సాలే బీజేపీ టార్గెట్‌‌ చేసే అవకాశం ఉంది. అయితే ఏపీలో ఆ పార్టీ ఇప్పుడిప్పుడే గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో బలం పెంచుకునే పనిలో పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపడం కష్టమే. ఇక ఒరిస్సాలో క్షేత్ర స్థాయిలో బలం ఉన్నా.. పార్టీని నడిపించే ఒక స్ట్రాంగ్ లీడర్ అవసరం అక్కడ కనిపిస్తోంది. తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే, డీఎంకే మధ్య రాజకీయం నడుస్తోంది. ఇప్పట్లో అక్కడ జాతీయ పార్టీలకు చాన్స్ లేనట్టేనని చెప్పొచ్చు.

వీధి పోరాటాలతో తన వ్యతిరేక పార్టీలను ఎదుర్కోవడంలో మమతా బెనర్జీ నేర్పరి. ప్రతిపక్షాల అటాక్‌‌ నుంచి తనను తాను కాపాడుకుంటూ కౌంటర్లు ఇవ్వగలరామె. కానీ ఎన్ని ఉన్నా అధికారంలో ఉండగా ఏం చేశారన్నదే ప్రజలు చూస్తారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువులను ఆకట్టుకునేందుకు ఆమె ఏనాడూ పెద్దగా ప్రయత్నించలేదు. ఈ విషయంలో బీజేపీ నేతలను కౌంటర్ చేయడంలోనూ దీదీ ఫెయిల్ అయ్యారు. పైగా మంచి పరిపాలన అందించడంలో ఫెయిల్ అయ్యారన్నదే కాకుండా, మేనల్లుడిని తన వారసుడిగా తెరపైకి తెస్తూ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఆమెకు మైనస్. ఆమె చుట్టూ అల్లుడి సిండికేట్ చేరిందని, మమత వాళ్ల రిమోట్‌‌ కంట్రోల్‌‌లో ఆడుతున్నారని, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మమతకు నమ్మకస్తులుగా ఉన్న సీనియర్ నేతలు ముకుల్ రాయ్, సువేందు అధికారి లాంటి వాళ్లు తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ నుంచి బయటకు వచ్చారని జరుగుతున్న  ప్రచారం పార్టీకి పెద్ద దెబ్బే. కానీ ఆ డ్యామేజీ కంట్రోల్‌‌కు దీదీ ఏమీ చేయలేదు. ఇలాంటి కారణాల వల్లే గతంలో కాంగ్రెస్, లెఫ్ట్, యూపీలో సమాజ్‌‌వాదీ, బీఎస్పీ లాంటి పార్టీలు వీకయ్యాయి. వచ్చే నెల 2న కాంగ్రెస్, మమతా బెనర్జీ ఫేట్ ఎలా ఉండబోతోందన్నదానిపై ప్రజలకు, ఆ పార్టీల నేతలకూ ఇప్పటికే క్లారిటీ ఉంది. గెలుపు తమదే అన్న ధీమాతో బీజేపీ తలపడుతుంటే మిగతా పక్షాలు భయం భయంగానే పోటీలోకి దిగాయి.

దీదీ రిపోర్ట్ కార్డ్.. 
అధికారంలో ఉన్న పార్టీ తన హయాంలో ఏం చేసిందనేది పరిగణనలోకి తీసుకునే ప్రజలు ఓట్లేస్తారు. గత ఎన్నికల్లో ఇచ్చి హామీలు, చేస్తామన్న అభివృద్ధి పనులు ఎంత వరకు జరిగాయన్నది లెక్కలోకి తీసుకుంటారు. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రిపోర్ట్ కార్డ్ ఏ రకంగా చూసినా ఇంప్రెసివ్‌‌గా లేదు. పదేండ్ల పాలనలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఇప్పుడు బలం పెంచుకోగలగడానికి కారణమిదే. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో 34 ఏండ్లు అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే దీదీ కొట్లాడి అధికారంలోకి రాగలిగారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని పాలన చేయాలన్న ఆలోచన ఆమె చేయకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది.

బీజేపీ బ్యాలెన్సింగ్.. పాత మూసలో మిగతా పార్టీలు 
బీజేపీ పోలరైజేషన్ పాలిటిక్స్ చేస్తోందంటూ ఆరోపణలు చేయడం ద్వారా మైనారిటీ ఓట్లు తెచ్చుకోవచ్చని తృణమూల్ సహా అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. కానీ ఆ పాత మూస విధానాలే వాటిని ప్రజలకు దూరం చేస్తున్నాయని గ్రహించడం లేదు. అయితే బీజేపీ మాత్రం ఇటు మెజారిటీ, అటు మైనారిటీ వర్గాలనూ బ్యాలెన్స్ చేస్తోంది. టెంపుల్స్‌‌తో పాటు మసీదుల సందర్శనకూ వెళ్తూ బీజేపీ నాయకులు తమకు అన్ని మతాలూ సమానమేనన్న భావన ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిటీ, రెలిజియన్ పోలరైజేషన్ అనేది కచ్చితంగా 40 నుంచి 50 శాతం వరకు పని చేస్తుందన్నది వాస్తవమే. కానీ పూర్తిగా అదే పార్టీలను గెలిపిస్తుందనుకోవడం పొరబాటు. అన్ని పార్టీలు కూడా కేవలం కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం మాని  తాము చేసిన, చేయాలనుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటన్న ది చెబితేనే ప్రజలు అట్రాక్ట్ అవుతారని తెలుసుకోవాలి.
- అనితా సలుజా, సీనియర్ జర్నలిస్ట్