- ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఆశావహులతో సమావేశం
- ఎన్నికల కార్యచరణపై సమీక్ష
- కొత్త నేతల చేరిక కోసం ప్రయత్నాలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులు డిసైడ్ కాగా.. కాంగ్రెస్అభ్యర్థుల జాబితా కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే నల్గొండ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ, ఆలేరు స్థానాలకు హైకమాండ్ క్లియర్ చేసింది. ఈ విషయంలో కాస్త వెనపడ్డామని భావిస్తున్న బీజేపీ రంగంలోకి దిగింది. మొన్నటి వరకు నియోజకవర్గాల్లో జరిగిన ‘ఎమ్మెల్యే ప్రవాస్‌యోజన’ కార్యక్రమాలు చేపట్టి క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. దీనికి కొనసాగింపుగానే నేడు, రేపు ఆ పా ర్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుక్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. 12 నియోజకవర్గాల్లోని జిల్లా, స్టేట్ ఆఫీస్ బేరర్స్, మండల పార్టీ అధ్యక్షులతో తరుణ్ ముఖాముఖిగా భేటీ కానున్నారు.
12 స్థానాల్లో పోటీకి సిద్ధం
12 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందని సీనియర్లు చెబుతున్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న చోట ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. మిగితా స్థానాల్లో హైకమాండ్ బలమైన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలు ఉండొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి పార్టీ పరిశీలనలో నల్గొండలో మాదగోని శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కన్మంత రెడ్డి శ్రీదేవి, దేవరకొండలో కల్యాణ్ నాయక్, లాలూనాయక్, నాగార్జునసాగర్‌లో కంకణాల నివేదిత, రిక్కల ఇంద్రసేనా రెడ్డి, డాక్టర్ రవినాయక్, మిర్యాలగూడలో సాధినేని శ్రీనివాస్‌రావు, భువనగిరిలో గూడూరు నారాయణ రెడ్డి, ఆలేరులో హరిశంకర్‌గౌడ్, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, నకిరేకల్‌లో శేపూరి ర వీందర్ పేర్లు ఉన్నాయి.
చేరికలపైనే దృష్టి
ఎన్నికల వరకు చేరికల పైనే దృష్టి పెట్టాలని పార్టీ ఆలోచన చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని ముఖ్య నేతలను బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంకేతాలు అందుతున్నాయి. కోదాడ బీఆర్ఎస్ నేత కన్మంత శశిధర్ రెడ్డి, సూర్యాపేటలో వట్టె జానయ్య యాదవ్, తుంగతుర్తిలో మందుల సామేలు తదితరులు పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తుంగతుర్తిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన రామచంద్రయ్యకే ఈసారి కూడా టికెట్ వస్తుందని తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి పాల్వాయి రజనీకుమారి కూడా ఆశిస్తున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి పేరు కూడా పార్టీ పరిశీలిస్తోంది.
ఆ నాలుగు స్థానాలు కీలకం...
బీజేపీ ఫోకస్ ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల పైనే ఉంది. ఉప ఎన్ని కల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. 2018లో ఇక్కడి నుంచి పోటీ చేసిన గంగడి మనోహర్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అవకాశం లభిస్తే హైదరాబాద్‌లో ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. సూర్యాపేట క్యాండిడేట్‌గా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరావు లేదా ఆయన కొడుకు వరుణ్ రావు, హుజూర్‌నగర్‌లో పార్టీ సీనియర్ నేత గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నల్గొండలో శ్రీనివాస్‌గౌడ్, వర్షిత్ రెడ్డి మధ్య పోటీ ఎక్కువగా ఉంది. బీసీ కో టాలో శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పర్యటన ఇలా..
పర్యటనలో భాగంగా తరుణ్ చుగ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నల్గొండకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష చేస్తారు. గురువారం ఉదయం మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, ఆలేరు, భువ నగిరి నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం సూర్యాపేట బయల్దేరి వెళ్తారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య లీడర్లతో తరుణ్ చుక్, స్టేట్ జనరల్ సెక్రటరీ బంగారు శ్రుతి భేటీ అవుతారని జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ‘వెలుగు’తో చెప్పారు.