పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ సర్కారు 34 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగటం ప్రపంచంలోనే ఒక రికార్డు. ఆ రాష్ట్రాన్ని తమ కూటమికి రాజకీయ కంచుకోటలా నిర్మించుకున్న కమ్యూనిస్టులను మమతా బెనర్జీ ఒక్కసారి కాదు వరుసగా రెండో సారి కూడా ఓడించారు. తద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. అదే క్రమంలో జాతీయ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేయాలనుకున్నారు. ఐదేళ్ల క్రితం కేంద్రంలో కమలనాథుల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ అదే లక్ష్యంగా పనిచేశారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఎన్ఆర్సీ తదితర మోడీ సర్కార్ నిర్ణయాలను మమత తీవ్రంగా తప్పుపట్టారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్డీఏ గవర్నమెంట్‌ని ఒక రేంజ్లో విమర్శించారు. రాష్ట్రాల్లోని రీజనల్ పార్టీల ప్రభుత్వాలను కేంద్రం టార్గెట్ చేస్తే అడ్డుకోవటానికి ఒంటి కాలుపై లేచారు. సెంటర్లో మరోసారి మోడీ పవర్లోకి రాకుండా చేయాలని పట్టుదలతో ప్రయత్నించారు. బీజేపీ, టీఎంసీ మధ్య నెలకొన్న ఈ పోటీ వాతావరణం తాజా జనరల్ ఎలక్షన్స్‌లో తారాస్థాయికి చేరింది.
వచ్చే రెండేళ్లు కీలకం
ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని దాదాపు పది ఎగ్జిట్ పోల్స్ ఔట్‌రైట్‌గా క్లారిటీ ఇచ్చేశాయి. అంతేకాదు. వెస్ట్ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ సెగ్మెంట్లలో కమల దళం ఈసారి పదికి తక్కువ కాకుండా ఎంపీలను గెలుస్తుందని అంచనాకి వచ్చాయి. మ్యాగ్జిమం 20 సీట్లను తన ఖాతాలో వేసుకుంటుందన్న అంచనాలుకూడా లేకపోలేదు. 2014 జనరల్ ఎలక్షన్లో బెంగాల్లో కేవలం రెండు చోట్లే విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు భారీగా పుంజుకుంటుందని లెక్కలు కట్టాయి. దీంతో.. 2021లో శాసన సభ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో పాలిటిక్స్ ఎలా ఉంటాయనేదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయం గతానికి పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. పూర్వం.. తృణమూల్ కాంగ్రెస్‌కి, సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కి మధ్య హోరాహోరీ ఉండేది. కానీ.. ఫ్యూచర్లో టీఎంసీకి, బీజేపీకి మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్ జరుగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకంగా మమతా బెనర్జీకి కష్ట కాలమేనని భావిస్తున్నారు.
సింగూరులో టాటా కంపెనీ ఏర్పాటు కోసం సాగు భూములను బలవంతంగా లాక్కున్న లెఫ్ట్ సర్కార్‌కు ఈ ఫైర్ బ్రాండ్ అప్పట్లో చుక్కలు చూపించారు. ఆ సంస్థను గుజరాత్‌కి తరిమేసి ‘రైతుబంధు’గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆనాడు అధికార పక్షం సాగించిన దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని మరో దుర్గామాతగా అభిమానులతో పిలిపించుకున్నారు. ఆ వయొలెన్స్‌తో కమ్యూనిస్టులు జనానికి, ఓట్ల ద్వారా వాళ్లిచ్చే పవర్‌కి దూరమయ్యారు. అప్పటి నుంచి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసమే నిత్యం తపిస్తున్నారు.
మరో ‘సింగూరు’ తప్పదా?
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తే ఆ పార్టీ కూడా రాష్ట్రంలో రాజకీయంగా పట్టుబిగిస్తుంది. డెవలప్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఒక్కదానివల్లే పూర్తి స్థాయిలో సాధ్యం కాదని, సెంట్రల్ గవర్నమెంట్ అండ కూడా ఉంటే తిరుగుండదని చెబుతూ ప్రజలను ఆకట్టుకోవటానికి పావులు కదుపుతుంది. జనం చూపు ఆ పార్టీ వైపుకు మరలకుండా ఉండాలంటే మమతా బెనర్జీ.. సింగూరు స్థాయిలో మరో ఉద్యమానికి తెరతీయక తప్పదని రాజకీయ పండితుల అభిప్రాయం.
మొండి పట్టుదలకు మారు పేరైన మమతా బెనర్జీ.. కాషాయం పార్టీపై వ్యతిరేకతను రీసెంట్గా బలంగానే చాటుకున్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం బీజేపీ చీఫ్ అమిత్ షా పశ్చిమ బెంగాల్లో తలపెట్టిన యాత్రకు అనుమతి ఇవ్వనంటే ఇవ్వనన్నారు. టీఎంసీ, బీజేపీల మధ్య శత్రుత్వం లోక్‌సభ పోలింగ్ సందర్భంగా కూడా బయటపడింది. రెండు విడతల ఓటింగుల్లోనూ వయొలెన్స్‌కి దారితీసింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నాటికి తృణమూల్ వర్సెస్ బీజేసీ రాజకీయం ఇలాగే రణరంగాన్ని తలపిస్తుందా అనే డౌట్లు వస్తున్నాయి.
మిగతా పార్టీల పరిస్థితి!
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయనేదాన్ని బట్టి పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీల భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. హస్తం పార్టీ వంద నుంచి నూట పాతిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అంటున్నారు. ఇదే నిజమైతే గ్రాండ్ ఓల్డ్ పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో చూసిన ఘోర ఓటమితో పోల్చితే చాలా బెటర్. ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ వచ్చే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా గానీ, టీఎంసీతో పొత్తు పెట్టుకొని గానీ కమలనాథులకు చెక్ పెట్టే సూచనలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని లెఫ్ట్ పార్టీలు తమకు టీఎంసీ, బీజేపీ రెండూ సమాన శత్రువులేనని చెబుతున్నాయి. సెక్యులరిజం విషయంలో నైతికంగా తమదే పైచేయి అని చెప్పుకునే కమ్యూనిస్టులు లోక్‌సభ ఎలక్షన్లో ఈ అంశం ఆధారంగా మార్కులు కొట్టేయలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పరీక్షలో లెఫ్ట్ పార్టీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. భవిష్యత్‌లోనూ నామ మాత్రంగా మిగిలిపోతాయని పొలిటికల్ అనలిస్టుల టాక్.