21వ శతాబ్దంలోనూ మహిళలు అన్యాయాన్ని, వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉద్యమ నాయకత్వంలోనూ, దక్షతలోనూ, రాజకీయరంగంలోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ ఇలా ఏకకాలంలో ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే కురుచ 'జీవులకు' దీటుగా సత్తా చాటుతున్న మహిళా శిరోమణులు ఎందరో 'టార్చ్ బేరర్లు'గా మనకు ఉన్నారు. అయినా మనం ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్లును తెచ్చి ఆమోదించింది.
ఈ నేపథ్యంలో.. చట్టం అమలయ్యేదెన్నడు? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాన్ని మహిళాలోకం అనుసరించాలనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. మహిళా బిల్లును ఆమోదించి, ఏదో సాధించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు, వెంటనే మహిళా రిజర్వేషన్లు అమలుచేయడానికి ఎందుకు పూనుకోవడంలేదో స్పష్టంగా చెప్పడం లేదు.
మహిళల ఓట్లపైనే బీజేపీ ఫోకస్
దేశవ్యాప్తంగా మహిళల ఓట్లను కొల్లగొట్టాలనే ఆశలు తప్ప, మహిళలకు చట్టసభల్లో అవకాశాలిచ్చి సాధికారతను కల్పించాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని తేటతెల్లమవుతోంది. ఈ చట్టం అమలుకు షరతులను విధించడం ద్వారా ఆ విషయాన్ని పరోక్షంగా కమలం పార్టీ నేతలే చెప్పుకున్నారు. ఇంకో పదేండ్ల తర్వాత అమలయ్యేదానికి ఇప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి, మహిళా బిల్లును ఆమోదించడంలో బీజేపీ సర్కారు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో భారత మహిళాలోకానికి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పోస్ట్ డేటెడ్ చెక్కులా ఉంది. మహిళల శక్తి సామర్థ్యాల గురించి నోటితో పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఆచరణలో మాత్రం అవకాశాలను కల్పించడంలో మొండిచేయిని చూపిస్తున్నారు.
19వ శతాబ్దంలోనే న్యూజిలాండ్లోమహిళా రిజర్వేషన్ల ఉద్యమం
న్యూజిలాండ్‌లో 19వ శతాబ్దంలోనే మహిళలకు చట్టసభల్లో సమానభాగం కావాల్సిందేనంటూ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం క్రమంగా ఐరోపా, అమెరికా, బ్రిటన్, బ్రిటీషు వలసదేశాలకూ పాకింది. అమెరికా ఉమెన్ క్రిస్టియన్ టెఫరెన్స్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ సారథ్యంలో న్యూజిలాండ్ శాఖ ఆ దేశంలోని మహిళా హక్కుల కోసం తీవ్రమైన పోరు సల్పింది. ఆంగ్ల భాషా సాహితీవేత్త జాన్ స్టువర్ట్ మిల్ రచనలు ఈ మహిళా ఉద్యమానికి ఉత్తేజాన్ని కల్పించాయి.
న్యూజిలాండ్‌లో మహిళా హక్కుల కోసం జరిగిన ఉద్యమానికి కాటె షఫర్డ్ నాయకత్వం వహించారు. 1907లో ఫిన్లాండ్, 1917లో కెనడా, 1918లో బ్రిటన్, 1920లో అమెరికా దేశాలు మహిళలకు ఓటుహక్కును కల్పిస్తూ చట్టాలను చేశాయి. అయితే, చాలా దేశాల్లో మహిళలు ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులే కావడం నాగరిక సమాజం సిగ్గు పడాల్సిన విషయం.
ఉక్కు మహిళ ఇందిరమ్మ ప్రాణ త్యాగం
ఉక్కు మహిళగా, భారత ప్రధానిగా తన ప్రాణాలనే అర్పించిన ఇందిరాగాంధీని దళితవాడల్లో, గిరిజన తండాల్లో ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రమే అమలు చేసిన మహిళగా కాకుండా పురుషాధిక్యపు రాజకీయ ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేయడంలోనూ, పొరుగు దేశాలను కట్టడిచేసి ప్రపంచదేశాల్లో భారతదేశ చరిత్ర, కీర్తిపతాకం ఎగురవేయడంలోనూ ఇందిరమ్మ చూపించిన ధీరత్వాన్ని దేశ మహిళలంతా ఆదర్శంగా తీసుకుని అనుసరించాలి.
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం 1987లో రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రధానిగా రాజీవ్ గాంధీ సాధించినదే. ఈ రోజు దేశంలోని అన్ని స్థానిక సంస్థల్లో మహిళలకు నాయకత్వ అవకాశాలు కాంగ్రెస్‌పార్టీ తెచ్చిన ఈ చట్టం ద్వారానే సంక్రమించిన విషయాన్ని ఎవరైనా కాదనగలరా? తెలంగాణ ఏర్పాటు చేయడంలో యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ చూపించిన తెగువ, త్యాగం కూడా ఇందిరమ్మ వారసురాలిగా ఆమెను తెలంగాణ ప్రజలకు ఆమెకు 'అమ్మ'గా నిలిపింది.
కవిత ఫోజులు హాస్యాస్పదం
లిక్కర్ దందాలో ఇరుక్కుని.. తప్పించుకునే మార్గం కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకున్న కల్వకుంట్ల కవిత నిర్వాకం తెలంగాణ మహిళలకు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. లిక్కర్ దందాలో 33శాతం కోసం ఢిల్లీ వీధుల్లో తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏదో సాధించినట్టు ఫోజులు కొట్టడం హాస్యాస్పదం. ఒక తెలంగాణ మహిళగా కవిత లిక్కర్ దందాలో నిండా మునిగిపోవడంతో దేశమంతా ముక్కున వేలేసుకుంది. ఈ కవితలాంటి వారెన్నడూ తెలంగాణ మహిళా వారసత్వాన్ని అందుకోలేరు. నిజంగానే కవితకు మహిళల మీద ప్రేమ ఉంటే బీఆర్ఎస్ టికెట్ల జాబితాలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఆమె తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ఇంటిముందు కవిత బైఠాయించి ఉండేది.
‘గీతా దీ’ అలుపెరగని పోరాటం
మన దేశంలోనూ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడిన మహిళానేతలు ఎందరో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గీతా ముఖర్జీ (గీతా దీ) మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని అలుపెరగని పోరాటం చేశారు. 27 ఏండ్ల కింద మహిళా బిల్లును ఆమోదించాలంటూ పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా గీతా ముఖర్జీ ఉన్నారు. ఇలాంటి మహిళా నేతలు మనదేశంలో చాలా మంది ఉన్నారు. అలా పోరాటం చేసినవారిలో చాలామంది ఇప్పుడులేకున్నా, వారి పోరాట ఫలాలు భావి తరాలకు తప్పకుండా అందుతాయి.