బెంగాల్‌‌, తెలంగాణపై బీజేపీ ఫోకస్

బెంగాల్‌‌, తెలంగాణపై బీజేపీ ఫోకస్
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ బలంగా ప్రయత్నిస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో గెలుపు తర్వాతి నుంచి అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తోంది. దాదాపు ఉత్తర భారతం మొత్తం ఆ పార్టీ సొంతంగానో, పొత్తులతోనో పవర్ లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ లో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఆ రాష్ట్రంలో సీఎం కుర్చీ సొంతం చేసుకునేందుకు బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక దక్షిణాదిలోనూ తన సత్తా చాటాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బీజేపీ మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది. టెక్నికల్ గా ఆ హోదా లేనప్పటికీ ప్రజాదరణ, ఆ రాష్ట్రాల్లో పార్టీకి ఉన్న బలం ఆధారంగా అపోజిషన్ బీజేపీనే. రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవడమే టార్గెట్ గా ఆ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్స్ తో రాష్ట్రంలో బీజేపీ జోరు పెరిగింది. రాబోయే నాగార్జున సాగర్ బై ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు కాషాయ పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సీఎం కేసీఆర్ అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ పవర్ గా నిలిచేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్లేస్ భర్తీ రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్లేస్ ను బీజేపీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల కారణంగా ఆ పార్టీ బలహీనపడిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ప్రజల్లోనూ నమ్మకం పోయింది. అదే సమయంలో బీజేపీ బలంగా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్, అనాలోచితంగా తీసుకున్న ఎల్ఆర్ఎస్, ధరణి, నియంత్రిత సాగు లాంటి నిర్ణయాల వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎత్తి చూపడంలో సక్సెస్ అయింది. దీంతో ప్రజలు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ను పక్కనపెట్టి.. బీజేపీకి పట్టంకట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని పోషిస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ ను మరింత బలహీనం చేయడం ద్వారా  వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎక్కువ స్థానాలు గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. రాష్ట్రంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడేండ్లు టైమ్ ఉన్న నేపథ్యంలో పార్టీ బలం పెంచుకోవడానికి చాన్స్ ఎక్కువగానే ఉంది. ఈలోపు హైదరాబాద్ లో ఎంఐఎంను కూడా దెబ్బకొడితే అధికారాన్ని బీజేపీ సొంతం చేసుకోగలుగుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మమతకు ఎదురు దెబ్బ పశ్చిమ బెంగాల్ లో 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో అక్కడ అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఈ ఎలక్షన్ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, సీఎం మమతా బెనర్జీకి, బీజేపీ సహా అన్ని పార్టీలకూ డూ ఆర్ డై బ్యాటిల్ లాంటిదే. అయితే గత పదేండ్లుగా బెంగాల్ లో ప్రభావం చూపలేకపోయిన బీజేపీ 2019 ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద షాకే ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 18 చోట్ల బీజేపీ గెలిచింది. 22 సీట్లు మాత్రం తృణమూల్ సొంతం చేసుకుంది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే బలంతో అధికార పార్టీని దెబ్బ కొట్టి పవర్ లోకి రావాలని ట్రై చేస్తోంది. అయితే ఇక్కడ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. దీంతో బీజేపీ బెంగాల్‌ ఎలక్షన్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. మమత చేసిన పెద్ద తప్పు అదే ఏకధాటిగా 34 ఏండ్ల పాటు పశ్చిమ బెంగాల్ ను పాలించిన సీపీఎంను పడగొట్టి 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. నిరంతరం పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చిన ఆమెపై ప్రజల్లో ఎంతో అభిమానం ఉంది. అయితే గడిచిన కొన్నేండ్లుగా కేంద్రంతో  కొట్లాటలతో రాష్ట్ర అభివృద్ధిని పెద్దగా పట్టించుకోవడం లేదన్న చెడ్డ పేరు ఆమెపై పడింది. అలాగే కేంద్రం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్న పెట్టుబడి సాయంపై మమత వివాదం రేపారు. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులకు నేరుగా ఆ సాయం అందకుండా అడ్డుకోవడం ఆమె చేసిన అతి పెద్ద పొరపాటుగా చెప్పొచ్చు. మరే రాష్ట్రమూ ఇలాంటి పని చేయలేదు. మైనారిటీలే ఆమె బలం 2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు 14 శాతం ఓట్లు సాధించాయి. ఆ పొత్తును రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఆ పార్టీలు ఇప్పటికే పూర్తిగా బలహీనంగా మారడంతో ఈ పొత్తు బీజేపీపై గానీ, తృణమూల్ పై గానీ పెద్దగా ఎఫెక్ట్ చూపించదు.  అయితే ఆ రాష్ట్రంలో 27 శాతం వరకు ఉన్న  మైనారిటీ ఓటర్లే మమతకు అతి పెద్ద బలం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్ లో సెటిల్ అయిన వాళ్లే అందులో ఎక్కువ శాతం ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు బీజేపీ వ్యతిరేకమన్న భావనతో వారి ఓట్లు ఆ పార్టీకి పడే చాన్స్ లేదు. ఈ అంశం మమతా బెనర్జీకి ప్లస్ అవుతుంది. రాష్ట్రపతి పాలనకు చాన్స్? పశ్చిమ బెంగాల్ లో కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హింస కారణంగా మమత సర్కారును రద్దు చేసి ఎన్నికల ముందు రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకుంటే అధికార పార్టీ ఒత్తిడి లేకుండా ఎన్నికలు నిర్వహించొచ్చు. అయితే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బీజేపీలో చేరితే ప్రెసిడెంట్ రూల్ పెట్టడం మరింత ఈజీ అవుతుంది. ఇదే జరిగితే మమతా బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. నెక్స్ట్ లోక్ సభ ఎన్నికలకూ గేమ్ చేంజర్ తెలంగాణలో బీజేపీ రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. అయితే దాన్ని అడ్డుకోవాలంటే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతిపక్షాలను విడదీసి.. అన్ని పార్టీలు నిలదొక్కుకునేలా చేయాలి. అలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ద్వారా కేసీఆర్‌‌ సర్కారుకు గండం గట్టెక్కుతుంది. ఇక బెంగాల్ లో మమత దీనికి రివర్స్ స్ట్రాటజీలో వెళ్లాలి. బీజేపీని ఎదుర్కొని ఆమె గెలవాలంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కలుపుకొని పోటీ చేయాలి. అయితే కేసీఆర్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. మమతకు ఆ చాన్స్ లేదు. బెంగాల్ లో ఏం జరుగుతుందన్న దానిపై కేసీఆర్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ బీజేపీ గెలిస్తే ఆ పార్టీ బలం మరింత పెరుగుతుంది. ఈ గెలుపోటములు నెక్స్ట్ లోక్ సభ ఎన్నికలకూ గేమ్ చేంజర్ అవుతాయి. మరి బెంగాల్‌ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి. బీజేపీ వైపే బెంగాలీలు ‘దేశమంతా రేపు ఆలోచించే విషయాన్ని.. బెంగాలీలు ఈ రోజే ఆలోచిస్తారు’.. స్వాతంత్ర్య పోరాట యోధుడు గోపాల కృష్ణ గోఖలే వందేండ్ల క్రితం చెప్పిన మాట ఇది. బెంగాల్ ప్రజలు ఎంతో మేధావులని, వాళ్లు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ఉద్దేశం. ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ప్రశ్నించే గొంతుకను, పోరాటం చేసే నాయకత్వాన్నే కోరుకుంటారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినా, శాంతి భద్రతలు అదుపు తప్పినా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి బుద్ధి చెబుతారు. 2011లో మమతా అధికారంలోకి రావడానికి కారణమైంది ఇదే. ఇప్పుడు కూడా ఆ మైండ్ సెట్ బెంగాలీలను బీజేపీ వైపు నిలబెడుతోంది. సీఎంగా ఉన్న మమతా బెనర్జీ నిరంతరం ఏదో ఒక ఆందోళనల పేరుతో పాలన  వదిలేసి అభివృద్ధిని, శాంతి భద్రతల పరిరక్షణను పట్టించుకోలేదు. దీంతో 2019 నుంచి బలం పెంచుకున్న బీజేపీ ఆమె తీరును గట్టిగా ప్రశ్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు, కాంగ్రెస్, లెఫ్ట్ వ్యతిరేక ఓటర్లు కూడా బీజేపీకే అండగా నిలుస్తున్నారు. రాబోయే ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో అధికారంలో ఉన్న కౌరవ సేనను దించి ప్రతిపక్షంలో ఉన్న పాండవులకు అధికారం కట్టబెట్టేందుకు బెంగాలీలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి మోడీ హవా తోడవడంతో బీజేపీ విజయానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పైగా బెంగాల్ లో మంచి పట్టున్న తృణమూల్ నేత ముకుల్ రాయ్, మమత కేబినెట్ లో మంత్రిగా ఉన్న సువేంద్ర అధికారి లాంటి వాళ్లు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం పెరగడంతోపాటు మమతకు పెద్ద షాక్ తగిలినట్టయింది. వీరి రాకతో మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తృణమూల్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరే చాన్స్ ఉంది. – పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్