స్టార్ క్యాంపెయినర్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
డివిజన్ల వారీగా మీటింగ్స్‌కు ఏర్పాట్లు
హామీల అమలులో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. గ్రేటర్ లో పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ గ్రేటర్ పరిధిలో ఉండడం, కేంద్ర మంత్రి హోదాలో ఉండటంతో కిషన్ రెడ్డికి ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలలుగా ప్రతి వారం సిటీ నేతలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డివిజన్ల వారీగా పార్టీ కేడర్ తో మీటింగ్ లు పెట్టి.. దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, ఆ పార్టీ మిత్రపక్షమైన మజ్లిస్ ల వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ కేడర్ ను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. డివిజన్ల వారీగా ఉన్న సమస్యలను గుర్తించాలని.. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో వారిపై చార్జీషీట్ తయారు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి క్రియాశీలంగా వ్యవహరించనున్నారనే సంకేతాలు పార్టీ కేడర్ కు చేరాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉండటం ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
టీఆర్ఎస్ వైఫల్యాలను నిలదీస్తూ..
కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కార్ ఫెయిలవడంపై హైదరాబాద్ సిటీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఇది బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. సిటీలో డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్ల నిర్మాణం వంటి ప్రధాన సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం, మున్సిపల్ మంత్రి గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో.. జనం టీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఉన్నారని బీజేపీ గుర్తించింది. దీన్ని ఓట్ల రూపంలోకి మలుచుకునే వ్యూహం సిద్ధం చేస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు వివిధ స్కీంల కింద రాష్ట్రానికి, ముఖ్యంగా సిటీల డెవలప్మెంట్కు నిధులు అందిస్తుండటం కూడా సానుకూలం అవుతుందని బీజేపీ నేతల ఆలోచన. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినా.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎలక్షన్లలో నలుగురు ఎంపీలు గెలవడం, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోవడంతో బీజేపీ కేడర్‌లో జోష్ పెరిగింది. ఇక ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు బీజేపీలో చేరడంతో పార్టీ బలోపేతం అవుతోందని.. హిందూవాది
అయిన బండి సంజయ్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వడం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని నేతలు అంటున్నారు. వీటన్నింటికీ తోడుగా కేంద్ర మంత్రి సారథ్యంలో గ్రేటర్ ఎలక్షన్లకు రెడీ అవుతుండటం బీజేపీకి కలిసొస్తుందని చెప్తున్నారు.