
యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ జెండాను ఆఫీసుల వద్ద ముఖ్య లీడర్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు బీజేపీ చరిత్రను వివరించారు. 1951లో భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటై 1977లో జనతా పార్టీలో విలీనమైందని చెప్పారు. అనంతరం జనసంఘ్ నుంచి జనతా పార్టీలో చేరిన వారందరూ కలిసి 1980 ఏప్రిల్ 6న బీజేపీని ఏర్పాటు చేశారని తెలిపారు.
తొలి అధ్యక్షుడిగా మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్పేయి బాధ్యతలు నిర్వర్తించారని వివరించారు. పార్టీ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం రెండే ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద పార్టీగా అవతరించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.