
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఫకీర్ మొహమ్మద్ ఖాన్ మృతి చెందారు. గురువారం (మార్చి 20) శ్రీనగర్ తులసి బాగ్‌లోని తన అధికారిక నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఫకీర్ మొహమ్మద్ ఖాన్ మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మొహమ్మద్ ఖాన్ ఆత్మహత్యకు పాల్పడానికి వ్యక్తిగత కారణామా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఫకీర్ మొహమ్మద్ ఖాన్ మృతి పట్ల స్థానిక బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, జమ్మూ కాశ్మీర్లో కీలక రాజకీయ నేత ఫకీర్ మొహమ్మద్ ఖాన్ 1996 నుంచి 2002 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ నేత మహ్మద్ అన్వర్‌ను ఓడించారు. ఆ తర్వాత 2002, 2008, 2014, 2024 ఎన్నికల్లో మొహమ్మద్ ఖాన్ వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు.
2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గురేజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఖాన్ 7,246 ఓట్లతో (40.34 శాతం) రెండవ స్థానంలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జెకెఎన్‌సి) నాయకుడు నజీర్ అహ్మద్ ఖాన్ చేతిలో 8,378 ఓట్ల తేడాతో ఫకీర్ మొహమ్మద్ ఖాన్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలై సరిగ్గా ఆరు నెలలు కూడా కాకముందే ఆయన ఆత్మహత్యకు పాల్పడటం జమ్మూ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : పూణెలో ట్రంప్ వరల్డ్ సెంటర్