అయిజ, వెలుగు: కేంద్ర జీపీలకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని బీజేపీ గద్వాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రూ. 3,500 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇప్పటివరకు ఒక్కరికీ ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు జీపీ నిధులు వాడుకొని, తిరిగి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని, బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు, గ్రాంట్లు విధిగా జీపీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. నేతలు మెడికల్ తిరుమల్ రెడ్డి, నరసింహయ్యశెట్టి, శేఖర్, ప్రదీప్, భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, వెంకటేవ్ యాదవ్ పాల్గొన్నారు.
నయా సాల్ జోష్
న్యూ ఇయర్ వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆదివారం ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రభుత్వ , పార్టీ ఆఫీసులతో పాటు ఇండ్లల్లో కేక్‌లు కట్ చేసి విషెస్ చెప్పారు. మన్యంకొండ, జోగులాంబ, ఇతర ఆలయాలు భక్తులతో కిటకిటలాయి. గంటల తరబడి బారులు తీరి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో పిల్లలమర్రి, మయూరి ఎకో పార్కులు జనంతో నిండిపోయాయి. ఫ్యామిలీతో సహా వచ్చి కేక్‌లు కట్ చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ.. కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇంటి నుంచి లంచ్ తెచ్చుకొని అక్కడే భోజనం చేశారు. - నెట్‌వర్క్, వెలుగు
స్వామియే శరణం అయ్యప్ప
మక్తల్ పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఆదివారం అయ్యప్ప స్వామి దేవాలయంలో 40 వ మహాపడిపూజ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గురు స్వామి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఉదయం గణపతి హోమం, గోపూజ, కలశ స్థాపన చేపట్టారు. అనంతరం ఆజాద్ నగర్ లోని ఉమామహేశ్వరాలయం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి రథంపై ప్రతిష్ఠించడంతో పాటు కలశాన్ని తలంపై పెట్టుకొని అయ్యప్ప ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం భజన చేస్తూ, భక్తిగీతాలు పాడుతూ పడిపూజ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలను వేలంపాట వేయగా.. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి రూ .5 .11 లక్షలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అనిల్ కుమార్ , శ్రీధర్ గౌడ్ , లక్ష్మణ్ గౌడ్ , శివరాం, అనిల్ గౌడ్ పాల్గొన్నారు. - మక్తల్, వెలుగు
సావిత్రిబాయి ఫూలేకు భారత రత్న ఇవ్వాలి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: సావిత్రిబాయి ఫూలేకు భారత రత్న ఇచ్చి గౌరవించాలని అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షుడు రాయికంటి రాందాస్ డిమాండ్ చేశారు. ఈ నెల 3న సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకొని నిర్వహించే ఆత్మీయ సభను సక్సెస్ చేయాలని కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే అట్టడుగు వర్గాల్లోని మహిళలకు విద్య నేర్పించారని గుర్తు చేశారు. అగ్రవర్ణాలు ఎన్ని కుట్రలు చేసినా.. ముందుకే సాగారని కొనియాడారు. కానీ పాలకవర్గాలు సావిత్రిబాయిని పట్టించుకోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ నాయకులు పరమేశ్వర్, పాతూరి రమేశ్, బుర్రన్న, రాజగాని అశోక్, ఎన్.శ్రీనివాసులు, రమేశ్ బాబు, శేఖర్, వెంకటయ్య పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లిని పట్టించుకోలే.. 300 కి.మీ.లకు చేరిన ఎల్లేని పాదయాత్ర
నాగర్‌కర్నూల్, వెలుగు: కొట్ర–నంద్యాల హైవే మీదున్న పెద్దకొత్తపల్లి మండలాన్ని గత ఎమ్మెల్యేలు విస్మరించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఆరోపించారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చేరడంతో 300 కిలో మీటర్ల మైలురాయి దాటింది. ఈ సందర్భంగా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తీర్మాలపూర్ గ్రామ ప్రజలు సుధాకర్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలతో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, ఆలయ పరిధిలోని గోశాలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ పెద్దకొత్తపల్లికి పారిశ్రామిక వాడ, మామిడి పండ్ల మార్కెట్, జూనియర్, డిగ్రీ కాలేజీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు గ్రామ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, తాను ఎమ్మెల్యేగా గెలవగానే డిమాండ్లు నెరవేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఓ రైతు పొలం వద్ద మహిళలతో కలిసి వరినాట్లు వేశారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి:బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి
వనపర్తి, పెద్దమందడి, వెలుగు: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో రేవల్లి మండల కేంద్రం, పెద్దమందడి మండలం పద్దగట్లలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ. లక్ష రుణమాఫీ, ఉచిత ఎరువులు, డబుల్ బెడ్ రూములు, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది యువకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు బూత్ అధ్యక్షులు, సీనియర్ కార్యకర్తల ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీలు వేస్తున్నామని వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జింకల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు నారాయణ, మాధవరెడ్డి, రామన్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా కన్వీనర్ విజయ్ కుమార్ సాగర్, మండల అధ్యక్షులు రమేశ్, అజయ్ గౌడ్ , జిల్లా యువ మోర్చా అధ్యక్షులు అనుజ్ఞారెడ్డి , స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయండి
అమనగల్లు, వెలుగు: ఆమనగల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాల ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను బీఆర్‌ఎస్ నేతలు కోరారు. ఆదివారం వారిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమనగల్లులో ఎస్టీవో, ఆర్టీవో, ఎసీపీ, వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. అలాగే జంగారెడ్డిపల్లి నుంచి చంద్రాయిన్‌పల్లి వరకు డబుల్ రోడ్డు, పోలెపల్లి నుంచి ముద్విన్, ఆకుతోటపల్లి నుంచి సీతారాంనగర్ తండా వరకు బీటీ రోడ్లు , మంగళపల్లి చెన్నారం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని విన్నవించారు. కేఎల్‌ఐ డీ-82 కాల్వలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని రిక్వెస్ట్ చేశారు. ఎంపీటీసీ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు పత్య నాయక్, వెంకటేశ్, గణేశ్, మహేశ్ పాల్గొన్నారు.