
- రెండు ఎమ్మెల్సీ స్థానాల విజయంతో బీజేపీలో పెరిగిన జోష్
- ఉత్తర తెలంగాణలో మరింత పట్టు
- ఈ బూస్టింగ్తో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ మొదలైంది. ఇటీవల మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటిలో బీజేపీ విజయం సాధించింది. ఇది త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు బూస్టింగ్గా ఉపయోగపడుతోందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదే ఊపుతో స్థానిక సంస్థలే టార్గెట్ గా ముందుకు పోవాలని బీజేపీ డిసైడ్ అయింది. రాష్ట్రంలో కరీంనగర్– నిజామాబాద్ – ఆదిలాబాద్– మెదక్ జిల్లాల సెగ్మెంట్ టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు.
ఈ గెలుపుతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీలో హవా మొదలైంది. ఇప్పటికే ఆ ఏరియాలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఉత్తర తెలంగాణను బీజేపీకి అడ్డగా మార్చుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తోంది. కరీంనగర్ నుంచి ఎంపీగా బండి సంజయ్ కేంద్రమంత్రి బాధ్యతల్లో ఉన్నారు. ఇది ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఉపయోగపడిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది.
ఈ సమయంలో సర్కారు తీసుకునే పలు నిర్ణయాలపై బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన, ఆరు గ్యారంటీల అమలు, ఇతర అంశాలపై పోరాటాలు చేసి.. తన వాయిస్ ను ప్రజల్లోకి తీసుకుపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అనే వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని బీజేపీ డిసైడ్ అయింది.
‘స్థానిక’ ఎన్నికలకు బూస్టింగ్..
త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయాన్ని బూస్టింగ్ గా కమలనాథులు భావిస్తున్నాయి. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహా మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో జరిగాయి. ఈ ఎన్నికలను బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ప్రచారానికి వాడుకున్నది. ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు.
ఇది కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మూడు స్థానాల్లో పోటీ చేస్తే రెండింటిలో బీజేపీ విజయం సాధించడంతో... ఆ పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చింది. అయితే, బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో సర్కారు వ్యతిరేక ఓటు బ్యాంకుగా ఉన్న వారంతా బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ప్రజల్లో వస్తున్న కాంగ్రెస్ వ్యతిరేకతగా సమాజంలోకి తీసుకుపోవాలని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు కూడా దాదాపు పూర్తయ్యాయి.
బూత్ లెవెల్, మండల కమిటీలు దాదాపు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల కమిటీలూ పూర్తయ్యాయి. ఇక రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా ఈ వారంలోనే ఉండే అవకాశం ఉంది. ఇక, కొత్త టీములకు తోడుగా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడం.. పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. దీన్ని అలాగే కంటిన్యూ చేయాలని రాష్ట్ర నేతలు ప్రోగ్రామ్ షెడ్యూల్ రెడీ చేస్తున్నారు.