కేరళలో.. బీజేపీ వింత ఫార్ములా

కేరళలో.. బీజేపీ వింత ఫార్ములా

కేరళని అక్కడి ప్రకృతి రీత్యా ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’గా గుర్తిస్తారు. ఈ రాష్ట్రంలో బలమైన ఇద్దరు శత్రువులతో ఏకకాలంలో ఫైటింగ్‌ చేయకుండా బీజేపీ జాగ్రత్త తీసుకుంది. బెంగాల్‌, త్రిపుర తరహాలోనే మార్క్సిస్టుల నాయకత్వాన్ని దెబ్బ తీయడానికి పరోక్ష యుద్ధానికి తెర తీసింది. కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో 14 చోట్ల కాంగ్రెస్‌ లీడర్‌షిప్‌లో పనిచేస్తున్న యూడీఎఫ్‌  అభ్యర్థులకు మద్దతునిచ్చింది. తన ఓటు బ్యాంక్‌ చెదరకుండా భద్రపరచుకుంది. శబరిమలలో ఆడవాళ్లకు ప్రవేశం, కేరళలో వరద బీభత్సం వంటి అంశాలతో తన లాభం కన్నా… లెఫ్ట్‌ ఫ్రంట్‌కి నష్టం ఎలా చేయాలా అన్న కోణంలోనే ఎన్నికల పోరు జరిపింది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలనాటికి గ్రామీణ స్థాయికి చొచ్చుకుపోయేలా ప్లాన్‌ చేసింది.

విజయం సాధించాలంటే వేగిర పడకూదంటారు. . కేవలం పరుగు పెట్టడమొక్కటే విజయాన్ని తీసుకురాదు. అప్పుడప్పుడు అవసరాన్నిబట్టి వెనకడుగుకూడా వేస్తుండాలి. ఫార్ములా వన్‌ రేసులో సైతం ల్యాప్‌ తీసుకోవడం సహజం. తదుపరి వ్యూహ రచనకు ఆ గ్యాప్‌ చాలా అవసరం. బీజేపీ తనకు బలం లేనిచోట్ల సరిగ్గా ఇలాంటి వ్యూహాలనే వేస్తోంది. ఏకకాలంలో ఇద్దరు శత్రువులతో పోరాడినందువల్ల విజయం రాదు సరికదా, ఆయాసం మిగులుతుంది. ఐడియాలజీ పరంగా పక్కా వ్యతిరేకమైన లెఫ్ట్‌ కూటమిని దెబ్బ తీయడానికి దేశంలో సెంట్రిక్‌, సెంట్రిక్‌ రైట్‌ పార్టీలకు పరోక్ష మద్దతునిస్తోంది. బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ని ఢీకొట్టడానికి తృణమూల్‌ని ఎంకరేజ్‌చేసింది. 1999 ఎన్నికల్లో ఎన్డీయేలో కలుపుకుంది. 2011 ఎన్నికల నాటికి బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లేకుండా చేసింది. ఇప్పుడు తన యుద్ధాన్ని తృణమూల్‌ వైపు తిప్పింది.

తాజాగా కేరళలోనూ ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది. సాక్షాత్తూ రాహుల్‌ గాంధీ నిలబడ్డ వయనాడ్‌  నియోజకవర్గంలోనే తన కేండిడేట్‌ని నిలబెట్టకుండా దూరం జరిగింది.  ఆ సీటుని ఎన్డీయే మిత్రపక్షమైన భారతీయ ధర్మ జన సేన (బీడీజేఎస్‌)కి వదిలేసింది. అక్కడ బీజేపీ 2009లో 31,687 ఓట్ల (3.85 శాతం)తో  నాలుగు స్థానం సాధించగా, 2014లో 80,752 ఓట్ల (8.82 శాతం)తో మూడో స్థానానికి ఎగబాకింది.  కేవలం అయిదేళ్లలోనే 5 శాతం ఓట్లను పెంచుకుంది. కాంగ్రెస్‌కి 2009లో 410,703 ఓట్లు, 2014లో 377,035 ఓట్లు వచ్చాయి. మరో వైపున సీపీఐ ఓట్లు లక్ష వరకు పెరిగాయి. అందుకే ఈసారి రాహుల్‌ గాంధీ వయనాడ్‌లో నిలబడడానికి ముందుకు రాగానే బీజేపీ వెనక్కి తగ్గింది.

దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వెనకడుగుకూడా అవసరమేనన్న ఛత్రపతి శివాజీ వ్యూహాన్ని ఇక్కడ ప్రయోగించింది. 2014లో పెరిగిన సీపీఐ ఓట్ల బలం తాజా ఎన్నికల్లో పదేళ్ల క్రితానికి అంటే,  రెండున్నర మూడు లక్షల మధ్యకి దిగిపోయింది.  బీజేపీ మిత్రపక్షమైన బీడీజేఎస్‌ అభ్యర్థి తుషార్‌ వెల్లపల్లి స్థిరంగా మూడో స్థానం దక్కించుకున్నారు. వయనాడ్‌  ఓటర్లలో సగం మంది హిందువులు కాగా, 28 శాతం ముస్లింలు, 21 శాతం క్రీస్టియన్లు ఉంటారు. ఈ లెక్కలన్నీ వేసుకున్నాక బీజేపీ కేడర్‌ సైలంట్‌గా ఉండిపోయింది.

ఈ ఒక్క చోటనే కాదు, కేరళలో వయనాడ్‌ నియోజకవర్గాన్ని ఆనుకున్న కాసరగోడ్‌, వడకర, కొళికోడ్‌, మలప్పురం, పలక్కాడ్‌ల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ క్యాడర్‌ ఒక పద్ధతిగా నడుచుకుందని అక్కడి ఓటింగ్‌ సరళినిబట్టి తెలుస్తోంది. ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడంకోసం కాకుండా లెఫ్ట్‌ ఫ్రంట్‌ని దెబ్బతీయడానికే తన పరివార్‌ని ఉపయోగించిందంటున్నారు పరిశీలకులు. దాదాపు అన్ని చోట్ల రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌ కేండిడేట్లే గెలిచారు. మలప్పురంలో ముస్లిం లీగ్‌ అభ్యర్థి పి.కె.కునాలికుట్టికిసైతం బీజేపీ క్యాడర్‌ పనిచేసిందంటున్నారు.  ఆరింటినీ నియోజకవర్గాలవారీగా చూస్తే… వడకరలో 2009 నుంచి వరుసగా కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుండగా, బీజేపీ 8 శాతం ఓట్లతో  స్థిరంగా ఉంది.  పలక్కాడ్‌లో 1996  నుంచి వరుసగా ఆరు సార్లు గెలిచిన సీపీఎంని బీజేపీ దెబ్బతీసింది. ఈసారి అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి వి.కె.శ్రీకంఠన్‌ గెలిచారు.  బీజేపీ ఓట్ల శాతాన్ని 15 నుంచి 21 శాతానికి పెంచుకుంది.

కాసరగోడ్‌ లోక్‌సభా స్థానంలో 1989 నుంచి సీపీఎం ఓటమి అనేదే ఎరుగదు. అలాంటిది 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 40 వేల ఓట్ల మెజారిటీతో దక్కించుకోగలిగింది. ముందుగా పెద్ద శత్రువును దెబ్బ తీయగలిగితే… ఆ తర్వాత ముఖాముఖీ ఫైట్‌లో తాడో పేడో తేల్చుకోవచ్చన్నది బీజేపీ ఎత్తుగడగా చెబుతుంటారు.  ఇదే క్రమంలో కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లోనూ 14 చోట్ల  సంఘ్‌ పరివార్‌ క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడిందని గణాంకాలతో విశ్లేషిస్తున్నారు. వీటిల్లో ఒకటి రెండు ముస్లిం లీగ్‌ బలంగా ఉన్న స్థానాలుకూడా ఉన్నాయి. అయినాసరే, మార్క్సిస్టుల నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌ని నామరూపాల్లేకుండా చేయడమే ‘సంఘ్‌’ లక్ష్యంగా పెట్టుకుందని అంచనా. శబరిమల వివాదం, కేరళలో వరదలు వంటి విషయాల్లో తమకు మైలేజీ పెరగిందన్న వాస్తవాన్ని గుర్తించినా, ఓట్ల లబ్దికోసం తాపత్రయపడకుండా మౌనంగా ఉందని చెబుతున్నారు. తిరువనంతపురం, అత్తింగళ్‌, పథనంతిట్ట, త్రిస్సూర్‌, పొన్నాని నియోజకవర్గాల్లో తమ పెరిగిన ఓట్లనుకూడా యూడీఎఫ్‌ వైపు మళ్లించిందని అంటున్నారు.

2016నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్‌ నాయకత్వంలో 91 సీట్లు గెలుచుకుని ఎల్డీఎఫ్‌ అధికారానికొచ్చింది. ప్రతిపక్షంగా 47 సీట్లతో యూడీఎఫ్‌ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ కేరళలో 15 సీట్లు సాధించింది. మొత్తంగా ఆ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్‌ 19 సీట్లు గెలవగా, సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌ కేవలం ఒకే ఒక్క స్థానం అలప్పుళలో పరువు దక్కించుకుంది.  గతంలో గెలిచిన ఎనిమిది సీట్లు కాసరగోడు, కన్నూరు, పాలక్కాడ్‌, అలత్తూరు (ఎస్సీ), త్రిసూర్‌, చలకుడి, ఇడుక్కి, అత్తింగళ్‌లను నిలుపుకోలేకపోయింది.  ‘గాడ్‌ ఓన్‌ కంట్రీ’లో ఎంట్రీకోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు 2019 లోక్‌సభ ఎలక్షన్లు మంచి ఉత్సాహాన్నిచ్చాయనడంలో సందేహం వద్దని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు.

రమ్య రాసిన రికార్డు

కేరళలో బద్దలైన ‘ఎర్ర’కోటల్లో రమ్య హరిదాస్‌ గెలిచిన అలత్తూరు ఒకటి. దాదాపు 48 ఏళ్ల తర్వాత దళిత మహిళ ఎన్నిక కావడం మళ్లీ ఇదే కావడం విశేషం. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా నెగ్గుతు న్న సీపీఎం నాయకుడు పీ.కె.బిజుని రమ్య లక్షా 58 వేల ఓట్ల మెజారిటీతో ఓడించింది. 1971లో భార్గవి థంకప్పన్‌ (సీపీఐ) అదూర్‌ నియోజకవర్గంనుంచి గెలిచారు. ప్రస్తుతం దానిని పథనంతిట్టలో కలిపేశారు.