ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ట్రిపుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచింది. 542 స్థానాల్లో ఏకంగా 303 సీట్లతో మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. ఈ జనరల్ ఎలక్షన్ తోపాటే ఆంధ్రప్రదేశ్ , అరుణాచల్ ప్రదేశ్ , ఒడిశా, సిక్కిం అసెంబ్లీ లకూ ఎన్నికలు జరిగాయి. ఆ నాలుగు రాష్ట్రా ల్లో ఒక్క చోటే (అరుణాచల్ ప్రదేశ్ ) కమలం వికసించి పవర్ లోకి వచ్చింది. ఒడిశాలో కిందటిసారి కన్నా 13 సీట్లు పెంచుకుంది. ఏపీ, సిక్కింలలో బీజేపీ ఎఫెక్ట్ జీరో అయింది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో శాసన సభకు ఎన్నికలు జరిగే జార్ఖండ్ , జమ్మూ కాశ్మీర్ , మహారాష్ట్ర, హర్యానాల్లో ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి.
మహారాష్ట్రలో మళ్లీ కలిసిన సేన
ఈ రాష్ట్రంలోనూ ప్రస్తుతం బీజేపీ కూటమి ప్రభుత్వమే ఉంది. పాతికేళ్లుగా కలిసి మెలిసి పనిచేస్తున్న బీజేపీ–శివసేన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకొని పోటీ చేసి అధికారాన్ని చేపట్టాయి. మహారాష్ట్రలో తొలిసారి పవర్లోకి వచ్చిన బీజేపీకి శివసేన మిత్ర పక్షమే అయినా నాలుగేళ్లుగా ఈ రెండు పార్టీలు ఉప్పూ నిప్పులాగే ఉన్నాయి. ఒకానొక దశలో ఈ కూటమి విడిపోతుందా అనే వరకు పరిస్థితి వచ్చింది. కానీ బీజేపీ చీఫ్ అమిత్ షా చాకచక్యంతో లోక్‌సభ ఎన్నికల్లో కలిసే బరిలోకి దిగి సత్తా చాటాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నమెంట్‌కి ప్రజల్లో ఫీల్ గుడ్ ఇమేజ్ ఉన్నట్లు పొలిటికల్ పండితులు చెబుతున్నారు. ఇది ఈ ఏడాది చివరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.
హర్యానాలో కూలిన జాట్ కోట
మొత్తం 90 సీట్లు ఉన్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలను చేజిక్కించుకొని మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో జాట్ల ప్రాబల్యాన్ని కాదని కమలదళం మనోహర్‌లాల్ ఖట్టర్‌ని ముఖ్యమంత్రిని చేసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 11 ఎంపీ సీట్లనూ తన ఖాతాలో వేసుకొని ఆ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ని చాటుకుంది. జాట్ల రిజర్వేషన్ గొడవలు, వయొలెన్స్ కట్టడిలో ఖట్టర్ ఫెయిల్ అయినట్లు మొదట్లో అనిపించినా ఆ ఎఫెక్ట్ జనరల్ ఎలక్షన్లో ఏమాత్రం లేకపోవటం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అనలిస్టులు అంటున్నారు
జమ్మూ కాశ్మీర్ మెడకు ఆర్టికల్ 370
ఈ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరలోనే ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఆగస్టు 15న అమర్నాథ్ యాత్ర ముగిశాక పోలింగ్ తేదీలను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. ఏడాది కాలంగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో బీజేపీ లేటెస్ట్ లోక్‌సభ ఎలక్షన్లో ఆరు స్థానాల్లో మూడింటిని గెలిచింది. పోయినసారీ మూడు సీట్లే నెగ్గిన కమలనాథులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. రాష్ట్రానికి అటానమస్ స్టేటస్‌ను కల్పించే ఆర్టికల్–370ని తొలగిస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. మొత్తం 87 సీట్లు కలిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 2014 చివరల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎలక్షన్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 చోట్ల గెలిచాయి. మిగతా పార్టీలు మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో ప్రభుత్వం ఏర్పడటానికి నాలుగు నెలలు పట్టింది. 2015 మార్చి ఒకటిన కొలువుదీరిన పీడీపీ–బీజేపీ సర్కారు 2018 జూన్ 19న బీజేపీ సపోర్ట్‌ని విత్ డ్రా చేసుకోవటంతో కుప్పకూలింది. అప్పటి నుంచి కమల దళానికి అనుకూలంగా ఉండే వ్యక్తి (గవర్నర్) పాలనలో కొనసాగుతున్న జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
జార్ఖండ్‌లో బీజేపీదే రికార్డు
ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ మరో ఆరు నెలల్లో (నవంబర్–డిసెంబర్లో) అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కమలదళం రికార్డ్ స్థాయిలో 81 స్థానాలకు 42 సీట్లను కైవసం చేసుకుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 19 ఏళ్లలో 10 మంది సీఎంలు మారారు. రాజకీయ అస్థిరతకు అడ్రస్‌గా మారిన జార్ఖండ్‌లో తొలిసారిగా బీజేపీయే ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇది రీసెంట్ లోక్‌సభ ఎన్నికల మాదిరిగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఆ పార్టీకి కలిసి రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అంచనాలకు తగ్గట్లే సీఎం రఘుబర్‌దాస్ ఎన్నికల దృష్ట్యా పావులు కదుపుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ లీడర్లు యూనిటీ లేక సతమతమవుతున్నారు. ఆ పార్టీ మిత్ర పక్షాలు జేఎంఎం, జేవీఎం లోక్‌సభ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని, రాష్ట్రంలో అధికార బీజేపీ తప్పిదాలు తమకు కలిసొస్తాయని లోకల్ పార్టీలు ఆశిస్తున్నాయి. కౌలు చట్టాలను మార్చటంపై ఆదివాసీల్లో నెలకొన్న ఆగ్రహం కమలానికి మైనస్ అవుతుందని చెబుతున్నాయి.