రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమన్న ధర్మాసనం... ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది.
ఈ క్రమంలో దేశంలోని ఆయా పార్టీలకు వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు పరిశీలిస్తే.. 2022-23లో బీజేపీకి రూ. 1300 కోట్లు వచ్చాయి. దీంతో దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మొత్తం 4,957 మంది దాతల ద్వారా రూ.614 కోట్ల విరాళాలు పొందింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా రూ.171 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి.
ఇక బీఆర్ఎస్ కు రూ. 529 కోట్లు, వైఎస్ఆర్సీపీకి రూ.52 కోట్లు, డీఎంకే రూ.185 కోట్లు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీకి రూ.3.2 కోట్లు, టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు అందాయి. ఈ రెండు పార్టీలకూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి 7 రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి.
ఎలక్టోరల్ బాండ్లు అంటే ఎంటీ?
ఎలక్ట్రోరల్ బాండ్లు.. వీటినే ఈ బాండ్లు అని కూడా అంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది.. ఈ.. ఈ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలను అందించవచ్చు. ఈ బాండ్ల విలువ రూ. 1000 నుంచి రూ.కోటి వరకు ఉంటుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయి, గత లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లను సాధించిన పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందేందుకు అర్హులుగా ఉంటాయి. ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలు, కొనుగోలు సమయంలో చెల్లించే డబ్బులకు లెక్కలు చెప్పాల్సిన అసవరం లేదు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి.