కాజీపేట రైల్వే డివిజన్‍ హోదాపై ఏపీ కుట్ర?

కాజీపేట రైల్వే డివిజన్‍ హోదాపై ఏపీ కుట్ర?
  • టీడీపీ సర్కారు విజ్ఞప్తితో విజయవాడకు తరలించే యోచనలో కేంద్రం
  • ఇందులో భాగంగానే తాజాగా 185 మంది సిబ్బందిని ట్రాన్స్ ఫర్ చేశారనే అనుమానం
  • ఇప్పటికే వెయ్యి నుంచి  521కు తగ్గిన కాజీపేట పోస్టులు 
  • గతేడాదే కోచ్‍ ఫ్యాక్టరీ, వ్యాగన్‍ మ్యాన్‍ఫ్యాక్చరింగ్‍ యూనిట్‍ మంజూరు
  • రైల్వే డివిజన్​ కూడా సాకారమవుతుందనుకునే  టైంలో కుట్ర కోణం  
  •  ఆందోళనకు రెడీ అవుతున్న కాంగ్రెస్​ నేతలు, కార్మిక సంఘాలు

వరంగల్‍, వెలుగు : దక్షిణ మధ్య రైల్వే జోన్ లో కీలకమైన కాజీపేట జంక్షన్‍ను ఏపీ విజ్ఞప్తితో విజయవాడకు తరలించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు యోచిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ఊతమిచ్చేలా తాజాగా 185 మంది రైల్వే సిబ్బందిని ఏపీకి తరలించడం తెలియడంతో శనివారం కాంగ్రెస్‍ నేతలు భగ్గుమన్నారు.  స్థానిక వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట పరిధిలోని రైల్వే యూనియన్‍ నేతలు, కార్పొరేటర్లు  శనివారం ప్రెస్‍మీట్‍ నిర్వహించి కేంద్రం, బీజేపీ నేతల తీరుపై ఫైర్‍ అయ్యారు. కాజీపేట డివిజన్‍ హోదాపై కుట్రలు ఆపాలని.. లేదంటే రెండు మూడు రోజుల్లోనే యూనియన్లు, ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు మొదలుపెడ్తామని హెచ్చరించారు. నేడో రేపో కాజీపేట రైల్వే డివిజన్‍ గా మారనుందని ఉద్యోగులు, జనాలు ఆశతో ఉండగా  అడిఆశలయ్యేలా కనిస్తుంది. 

 కోచ్‍ ఫ్యాక్టరీ రాకతో.. డివిజన్‍పై ఆశలు 

కేంద్ర ప్రభుత్వం కాజీపేట జంక్షన్‍ కేంద్రంగా రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ, వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్‍ యూనిట్‍ ఇప్పటికే మంజూరు చేసింది. స్టేషన్‍కు పక్కనుండే అయోధ్యపురంలోని 162 ఎకరాల్లో ప్రాజెక్ట్ పనులు స్పీడ్ గా నడుస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి కోచ్‍ల తయారీ షెడ్లు, ఇన్‍ఫ్రా కోసం టార్గెట్‍ పెట్టుకున్నారు. ఇటీవలే ఇక్కడి రైల్వే హస్పిటల్‍ను తిరిగి ప్రారంభించారు. 

అమృత్‍ భారత్‍ స్కీంలో భాగంగా రూ.24 కోట్లతో స్టేషన్‍ను డెవలప్‍ చేస్తున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‍ ప్రాంతంలో బస్‍స్టాండ్‍ నిర్మాణానికి అడుగులు పడ్తున్నాయి. ఈ క్రమంలో కాజీపేటకు డివిజన్‍ హోదా రాబోతున్నట్లు ఉమ్మడి వరంగల్‍ జిల్లా కాంగ్రెస్‍ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ నేతలు సైతం పలుమార్లు ప్రస్తావించారు.

విజయవాడ స్థాయి పెంచేందుకు..

దాదాపు 1000 పోస్టులతో ఉన్న కాజీపేట రైల్వే డిపో  ప్రాధాన్యతను తగ్గించేందుకు సమైక్య రాష్ట్రంలోనే  కుట్రలు మొదలయ్యాయి. ఇందుకోసం రైల్వేశాఖలో ఉన్నతస్థానాల్లో ఉన్న  ఆంధ్రా అధికారులు చక్రం తిప్పారు. 2007 నుంచే విజయవాడలోని లోకో రన్నింగ్‍ విభాగానికి  ఒక్కొక్కటిగా కాజీపేట పోస్టులను తరలించడం మొదలుపెట్టారు. దీంతో విజయవాడలోని చిన్నపాటి డిపో ప్రస్తుతం 500 మంది సిబ్బందితో పెద్ద డిపోగా మారింది. 

అదే సమయంలో  కాజీపేట రైల్వే లాబీలో సిబ్బంది సంఖ్య 706కు పడిపోయింది. కాగా, రైల్వే డివిజన్‍ హోదా కోసం ఏండ్ల తరబడి ఇక్కడి రైల్వే కార్మికులు, రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నప్పటికీ పట్టించుకోని రైల్వే ఉన్నతాధికారులు తీరా ఇటీవల మరోసారి 185 మంది సిబ్బందిని విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలకు తరలించడంపై  దుమారం రేగుతోంది.

అత్యధిక ఆదాయం సమకూర్చే జంక్షన్

కాజీపేట రైల్వే స్టేషన్ ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే ప్రవేశ ద్వారం కీలక రైల్వే జంక్షన్. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన పురాతన రైల్వే స్టేషన్‌గా పేరొందింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అత్యధిక ఆదాయం సమకూర్చే జంక్షన్‌ గానూ గుర్తింపు ఉంది.  కాజీపేట స్టేషన్‌ మీదుగా నిత్యం186 రైళ్లు వెళుతుండగా.. రోజుకు 30 వేల మందికిపైగా ప్రయాణిస్తుంటారు. కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌ స్థాయికి పెంచాలనే ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కార్యరూపం దాల్చలేదు.

మిత్రపక్షాన్ని సంతృప్తి పరిచేందుకేనా?

కాజీపేట రైల్వే డివిజన్​పై గతంలో ఉన్నతాధికారులు కుట్రచేస్తే.. ప్రస్తుతం కొందరు ఏపీ రాజకీయ నాయకులే ఆ పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  ప్రస్తుతం ఏపీలోని టీడీపీ కూటమి, కేంద్రంలోని ఎన్​డీఏ సర్కారులో కీలకంగా వ్యవహరిస్తోంది. టీడీపీ ఇచ్చే మద్దతుపైనే కేంద్రంలోని సర్కారు మనుగడ ఆధారపడి ఉంది. అందుకే టీడీపీ కూటమి చెప్పిందాని కల్లా కేంద్రం తలూపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు విశాఖపట్టణాన్ని రైల్వే జోన్‍ గా మార్చి, విజయవాడ డివిజన్‍ను అందులో చేర్చబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుత కాజీపేట స్థాయిని తగ్గించేందుకే ఇక్కడి  సిబ్బందిని విజయవాడ తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.