సమ్మక్క సారక్క వర్సిటీ గిరిజనులకు విద్యా వెలుగు. కారడవుల్లో కకావికలమైన బతుకులతో కాలం వెళ్లదీస్తున్న అజ్ఞాత ఆదివాసుల్లో.. చదువుల వెలుగు నింపనున్న కమలం పార్టీకి పుష్పాంజలి. ఆదివాసులు అంటే అడవుల్లో అభివృద్ధికి అందని ఆమడ దూరంలో ఉంటారు. ఆదివాసులకు అండగా మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఆదివాసుల అభివృద్ధికి నడుం బిగించిన మోదీ సర్కార్.. వారి చదువు కోసం 900 కోట్ల రూపాయలతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి పూనుకుంది.
ఆదివాసుల కులదైవాల పేరు మీదుగా ఆ విశ్వవిద్యాలయానికి సమక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు కొన్ని ప్రత్యేకమైన హామీలను కల్పించారు. అందులో భాగంగా రెండు రాష్ట్రాలకు సెక్షన్ 94 షెడ్యూల్ 13 (3) ప్రకారం 2 ట్రైబల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళలు, సాహిత్యం, భాష, ఆచార సంప్రదాయాలలో గిరిజనులది ప్రత్యేక శైలి. అలాగే నైపుణ్యాలు, సామర్థ్యాల, విషయాల్లో అత్యంత ప్రతిభావంతులు. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఉన్నత విద్యను అభ్యసించే సగటు జనాభాతో పోల్చి చూసినప్పుడు గిరిజనుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.
గిరిజన విద్యార్థులకు.. నో స్పెషల్ రిజర్వేషన్
తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేయబోయే గిరిజన వర్సిటీ శాటిలైట్ క్యాంపస్ ని పోరాటాల పురిటి గడ్డ, గిరిజన బిడ్డల గడ్డ అయిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి లో ఏర్పాటు చేయాలి. దీంతో ఉత్తర తెలంగాణ ఆదివాసీలకు, పక్కనే ఉన్న మహారాష్ట్ర ఆదివాసులకు వర్సిటీ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ గిరిజన వర్సిటీల్లో గిరిజనులకు ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్ లేదు. అన్ని యూనివర్సిటీల్లో ఉన్నట్లుగానే కేవలం 7.5% రిజర్వేషన్ సదుపాయం మాత్రమే ఉంది.
పేరుకే గిరిజన వర్సిటీ కానీ గిరిజన విద్యార్థుల ప్రవేశాలు కేవలం 7.5% గానే ఉంటున్నాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో 50% రిజర్వేషన్ మైనారిటీలకు కేటాయించినట్లు, నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ, బాబా సాహెబ్ భీం రావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో 50% రిజర్వేషన్ ఎస్సీ విద్యార్థులకు కేటాయించినట్లుగా ఈ గిరిజన వర్సిటీల్లో గిరిజన బిడ్డలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. గిరిజన విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే వారు గుండె నిండా ధైర్యంతో ట్రైబల్ యూనివర్సిటీలో చేరగలరు.
తెలంగాణలో 10% గిరిజనులు
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత విషయంలో వివిధ రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు 66.54 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. అక్షరాస్యత రేటు 49.5 ఉంది. ఇది రాష్ట్ర అక్షరాస్యత కన్నా సుమారు 17 శాతం తక్కువ. 2017 జులై నుంచి 2018 జూన్ మధ్య దేశవ్యాప్తంగా ‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్సంప్షన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన ‘జాతీయ నమూనా సర్వే’లో తెలంగాణ చివరి నుంచి 4వ స్థానంలో ఉంది.
తెలంగాణలో గిరిజనుల జనాభా 10 శాతంగా ఉంది. వీరిలో ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయనివారు 17% శాతంగా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా రెల్లి ప్రాంతంలో 2019లో తాత్కాలిక భవనాల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా తెలంగాణలో రూ.900 కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 169 ఎకరాల ప్రభుత్వ, 116 ఎకరాల అసైన్డ్, 50 ఎకరాల అటవీ భూమిలో గిరిజన వర్సిటీ నిర్మాణానికి కేంద్రం ముందుకు రావడం అభినందనీయం.
జక్కుల శ్రీనివాస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ