వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తది : వివేక్ వెంకటస్వామి

కేంద్ర బడ్జెట్ కేటాయింపులను ప్రజలకు వివరించేందుకు 9మంది నేతలతో ఏర్పాటు చేసిన కమిటీలో చోటు దక్కడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో కమిటీ మెంబర్ గా నియమించిన ప్రధానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తన ఎంపిక రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. జాతీయ నాయకత్వం అప్పజెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. 

బైక్ యాత్రల ద్వారా బీజేపీ ప్రజలకు చేరువవుతోందని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. జుక్కల్ నియోజకవర్గ ఇంఛార్జీగా బైక్ యాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని 11 మండలాలు తిరిగిన తనకు ఎమ్మెల్యే  సీటు పక్కాగా బీజేపీకే దక్కుతుందన్న విశ్వాసం కలిగిందని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు, పోలీసు కేసులు ఎవరినీ ఏం చేయలేవని నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.