![కార్పొరేట్లకు అండగా..!](https://static.v6velugu.com/uploads/2025/02/bjp-government-supporting-corporates-say-senior-journalist-md-munner_nvejqEuJMl.jpg)
భారతదేశంలో కార్పొరేట్లకు మేలుచేసే మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదిన్నర ఏండ్లుగా అధికారంలో ఉన్నది. కార్పొరేట్లకు ఆర్థిక వెసులుబాటు ఇస్తూనే ఉన్నది. కానీ, ఈ దేశానికీ బుక్కెడు బువ్వ పెడుతున్న రైతుల కష్టాలు మాత్రం తీరడంలేదు. రైతులు తమ హక్కుల కోసం, గిట్టుబాటు ధరకోసం, అప్పుల మాఫీ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. పన్నుల్లో భారీ వెసులుబాటు వారికే కల్పిస్తున్నారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో 35 శాతం కార్పొరేట్ టాక్స్ ఉండేది. అది కాస్త ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 26 శాతం చేసి కార్పొరేట్లకు టాక్స్‌లో రాయితీ ఇచ్చారు. ఇలా లక్షల కోట్ల రూపాయలు టాక్స్ నష్టం ప్రభుత్వానికి కలుగుతోంది.
మరోవైపు కార్పొరేట్లకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి. దేశంలోని 70 శాతం సంపద అంతా వారి చేతుల్లోనే ఉంది. పన్నుల్లో కార్పొరేట్ల భాగస్వామ్యం 30 శాతం, 70 శాతం టాక్స్ ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్టు పేర్కొనవచ్చు. నిజానికి గత పది ఏండ్లుగా కార్పొరేట్లకు లక్షల కోట్ల బ్యాంకుల రుణమాఫీ కల్పించారు. చౌకబారుగా ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అమ్మడమో, లీజుకు ఇవ్వడమో చేశారు. అధిక ధరలతో మధ్యతరగతి, సామాన్యులు పూర్తిగా ఆర్థికంగా దివాలా తీశారు. రూ. కోటి యాభై లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు మన దేశం నుంచి ఇటీవల ఉపసంహరించుకున్నారు. గడిచిన మూడు నెలల్లో రూ.70,000 కోట్ల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
బడ్జెట్ ద్వారా మధ్యతరగతి వేతన జీవులకు 12 లక్షల ఆదాయంకు పన్ను మినహాయించారు. ఇలా ఆరున్నర కోట్ల మందికి లాభం జరిగింది. కానీ, జీఎస్టీలో ఎలాంటి మార్పు లేని కారణంగా ఆ పన్ను వెసులుబాటు శరీరంలో 'నొప్పి'లాంటిది. శరీరంలో మరో వైపుకు 'ఆ నొప్పి'షిఫ్ట్ అయ్యిందని పేర్కొనవచ్చు. సామాన్యుడు మోసే వందకిలోల బరువు నుంచి ఒక పది కిలోల బరువు తగ్గడం వల్ల అతను పూర్తిగా కోలుకోవడం సాధ్యమా. దేశం మొత్తంలో బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగింది అని, 12 లక్షల ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను ఉండదనే వార్త న్యూస్ మీడియాలో హెడ్లైన్ అయ్యింది. ఒకవైపు తినుబండారాలపైన, కొన్ని నిత్యావసరాలపైన జీఎస్టీ మాఫీ చేసినా, రైతులకు ఋణం మాఫీ చేసినా, రైతులకు ఎమ్మెస్పీ ప్రకటించి ఉన్నా బాగుండేది.
విద్య, వైద్యానికి తగ్గిన బడ్జెట్ కేటాయింపులు
ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. ధరలు తగ్గిస్తాం అన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు. విద్య, వైద్యం సామాన్యునికి అందుబాటులోకి తెస్తాం అన్నారు. వీటిపైన గత బడ్జెట్ కన్నా కేటాయింపులు తగ్గించారు. వ్యసాయం బడ్జెట్ పరిస్థితి అంతే. ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఖాళీల భర్తీ ఊసు లేదు. 80 కోట్ల మంది పేదలకు ఐదు కేజీల రేషన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా పెద్ద మేలు చేస్తున్నట్టు చెపుతున్నారు. కష్టపడి పని చేసుకుని బతకడానికి అవసరం అయిన ఉపాధికి దారులు లేవు. భారీగా ఉత్పత్తులు తగ్గి పోయాయి.
ఉత్పాదకతపై సరైన ఆలోచన లేదు. దిగుమతుల భారం పెరిగింది. మాన్యుఫాక్చర్ సెక్టారును అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 2017లో ఈవిఐపి ( ఎవిరీవన్ ఇంపార్టెంట్ ) నో విఐపి అని పీఎం మోదీ ప్రకటించారు. అమలు మాత్రం శూన్యం. పాలకుల అంకెలు గారడీ జరుగుతోంది. ఉపాధి, అధిక ధరలు లాంటి అసలు విషయాల ప్రస్తావన లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి, కోల్ ఇండియాలకు కేటాయింపులు లేవు. ఏటా పన్నులు తదితర రూపంలో ఏటా రూ.12,000 కోట్లకు పైగా తీసుకుంటున్న కేంద్రం ఫండింగ్ మాత్రం బొగ్గు సంస్థకు చేయక
పోవడం శోచనీయం.