ప్రైవేటీకరణపై పోరుబాట!

ప్రైవేటీకరణపై పోరుబాట!

దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన పది ఏండ్లలో ప్రభుత్వ రంగాన్ని  ప్రైవేట్ పరం చేయడం జరుగుతోంది. తద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ చేసే నిర్ణయాన్ని అమలుచేయడం జరుగుతున్నది. యాభై శాతం ఎయిర్ పోర్టులు, పోర్టులు, బొగ్గు బ్లాకులు, రైల్వే స్టేషన్లు, ఎల్ఐసీ తదితర ప్రభుత్వ సంస్థలు, చివరికి డిఫెన్స్, స్టేడియంలను కార్పొరేట్​ సంస్థల అధీనంలో ఉన్నాయి. భారీగా ప్రభుత్వ భూములను సైతం కార్పొరేట్ శక్తులకు లీజుకు ఇచ్చేపని, అమ్మేసే పనికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.  దీనివల్ల సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కార్పొరేట్ల ధాటికి గత ఏడు ఏండ్లలో ఎన్ఎస్ఓ ప్రకారం 18 లక్షల చిన్న, పెద్ద  ప్రైవేట్ ఫ్యాక్టరీలు మూతపడి 54 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన లెక్కలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం వల్ల కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలు అయ్యాయి. 

పూలు అమ్మేకాడ కట్టెలు అమ్మే పరిస్థితి 

పేద, మధ్య తరగతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. మరోవైపు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ, పీఎం మోదీ కనీసం 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా పది లక్షలు కూడా ఇవ్వలేదు.  పైగా ఒక్క ఉద్యోగ నియామకం కూడా పేపర్ లీకులు లేకుండా జరుగని పరిస్థితి,  బ్యాంకులు, రైల్వే, యూనివర్సిటీలలో ఖాళీల భర్తీ లేదు.  మిలిటరీలో సైతం అవుట్ సోర్సింగ్ మాదిరి, నాలుగేండ్లు మాత్రమే సర్వీస్ తో అగ్నివీర్  పేరిట నియామకాలు చేశారు.    అగ్నివీర్​ పథకంపై పార్లమెంట్​లో  ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ లేవనెత్తినపుడు,  సంబంధిత శాఖ మంత్రి లేచి రాహుల్​ చెప్పేది అబద్ధం అంటాడు. మరి నిజం ఏమిటో చెప్పరు. ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు లేదు.  మూడు చోట్ల ఎయిర్ పోర్ట్ లలో నిర్మించిన భవనాల పై కప్పులు కూలిపోయాయి, పెద్ద పెద్ద వంతెనలు కూలిపోయినా జవాబు ఉండదు.  కేంద్రం ప్రస్తుతం విపక్షాల ప్రశ్నల వల్ల సాఫీగా మనుగడ సాగించలేని పరిస్థితి వచ్చింది. 230 దాకా సంఖ్యాబలం ఉన్న ఇండియా కూటమిని మోదీ సర్కారు ఎదుర్కోవడం కష్టమే అంటే అతిశయోక్తి కాదు. 

మా బొగ్గు మాకు కావాలె

 తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ఏకైక పెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో బొగ్గు బ్లాకులను వేలంలో పాల్గొనకుండా కేటాయించాలని ఆందోళన జరుగుతున్నది.  ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు ఇది. దాదాపు అన్ని కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. సంస్థ మనుగడకు సంబంధించిన విషయం కాబట్టి పోరుబాట పట్టారు. కానీ, ఎంతమంది, ఎప్పటిదాకా నిలబడతారో చూడాలి.  విషయం ఒక సింగరేణికి పరిమితం అయ్యింది కాదు.  దేశవ్యాప్తంగా  తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న కోల్ ఇండియా అనుబంధ బొగ్గు సంస్థలు, ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాలు, విస్తరణకు సంబంధించింది.  పార్లమెంట్​లో ఈ విషయం మీద చర్చ జరగాలి. ఏ రాష్ట్రం బొగ్గు బ్లాకుల మీద ఆయా రాష్ట్రానికి,  ప్రభుత్వానికి హక్కు ఉండాలి.  ఈ నెల 3న హైదరాబాద్​లోని  ప్రెస్ క్లబ్​లో హెచ్​ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కన్వీనర్​గా ఉన్న ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, టీఎన్టేయూసీ, ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈనెల 5 న ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో కోల్ బెల్ట్ బంద్, 6 నుంచి నిరాహార దీక్షలు జరగనున్నాయి. మొత్తానికి సింగరేణిలో మా బొగ్గు మాకు కావాలె అని పోరు ఉధృతం అవుతున్నది.

- ఎండి. మునీర్,  సీనియర్ జర్నలిస్ట్