
ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయనే చెప్పాలి. 400 సీట్లే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన NDA 300 సీట్లు కూడా దాటలేదు. మహరాష్ట్రతో పాటుగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు రావడం ఇందుకు కారణమని చెప్పోచ్చు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లుకు గానూ 71 స్థానాలను గెలుచుకున్న కమలం పార్టీ, 2019లో 62 స్థానాలను పడిపోయింది. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 33 మాత్రమే గెలుచుకోగలిగింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు ఇక్కడ బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టింది.
తద్వారా బీజేపీ నుంచి పోటీ చేసిన 49 మంది సిట్టింగ్ ఎంపీలలో 27 మంది ఓటమి పాలయ్యారు . వీరిలో స్మృతి ఇరానీ (అమేథీ), అజయ్ మిశ్రా తేనీ (ఖేరీ), కౌశల్ కిషోర్ (మోహన్‌లాల్‌గంజ్), మహేంద్ర నాథ్ పాండే (చందౌలీ), సాధ్వి నిరంజన్ జ్యోతి (ఫతేపూర్), భాను ప్రతాప్ సింగ్ వర్మ (జలాన్) వంటి ప్రముఖ పార్లమెంటేరియన్లు, కేంద్ర మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన మేనకా గాంధీ (సుల్తాన్‌పూర్), మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్‌వీర్ సింగ్ (ఎటా) వంటి ప్రముఖ పార్లమెంటేరియన్లు కూడా ఈ సారి ఓటమిని చవిచూశారు. 2019లో పోటీ చేసిన 54 మంది అభ్యర్థులకు తిరిగి బీజేపీ టికెట్ ఇవ్వగా 31 మంది ఈసారి విజయం సాధించలేకపోయారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (వారణాసి), మహేశ్ శర్మ (జీబీ నగర్), భోలా సింగ్ (బులంద్‌షహర్), రాజ్‌నాథ్ సింగ్ (లక్నో), హేమా మాలిని (మధుర)తో సహా మూడోసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పోటీ చేసి గెలిచారు. జితిన్ ప్రసాద (పిలిభిత్), ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ (బరేలీ), అతుల్ గార్గ్ (ఘజియాబాద్), ఆనంద్ గోండ్ (బహ్రైచ్), కరణ్ భూషణ్ సింగ్ (కైసెర్‌గంజ్) బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారి గెలిచారు.