హనుమకొండ, వెలుగు : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ నగర అభివృద్ధి జరుగుతోందని, నయీంనగర్ బ్రిడ్జిని కూడా ఆ నిధులతోనే నిర్మించారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి చెప్పారు. సెంట్రల్ ఫండ్స్‌తో కట్టిన బ్రిడ్జిని తామే కట్టామంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రోడ్డెక్కడం కరెక్ట్ కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, నాయకుడు చాడ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం నయీంనగర్ బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ఫండ్స్‌తో కట్టిన బ్రిడ్జికి 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందన్నారు.
కానీ అంతా తామే చేసినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గత పదేండ్లలో ఎమ్మెల్యేగా వినయ్‌భాస్కర్ చేసిందేమీ లేదని, పది నెలల్లో రాజేందర్‌రెడ్డి కొత్తగా చేస్తుందేమీ లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరు సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా మారిందని ఎద్దేవా చేశారు. చేతనైతే వరంగల్ ఎయిర్‌పోర్టుకు కావాల్సిన భూమి ఇవ్వాలని సవాల్ చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు కొలను సంతోష్‌రెడ్డి, కొండి జితేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు చాడ స్వాతి, గుజ్జుల వసంత నాయకులు ఆకులశ్రీకాంత్, నర్మెట్ట శ్రీనివాస్, దొంతుల వాసుదేవరెడ్డి, శనిగరపు విజయ్, ప్రభాకర్‌రెడ్డి, తీగల భరత్‌గౌడ్, కందగట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.