న్యూఢిల్లీ: ప్రధాని మోదీని కావాలనే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ టార్గెట్ చేశాయని బీజేపీ ఆరోపించింది. ఆయన ఇమేజ్ను దెబ్బతీసేందుకు 2002 నుంచి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా ఆరోపణలు చేసిందని, అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు నాడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలనలో ఉన్నాయని పేర్కొన్నది. గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డారని, నరేంద్రమోదీతో చేతులు కలిపారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర మండిపడ్డారు.
గురువారం సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. అదానీ గ్రూప్‌పై అమెరికా అభియోగాలు మోపిన 4 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని, ఆ సమయంలో ఒడిశా, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, దాని మిత్ర పక్షమే అధికారంలో ఉన్నాయని చెప్పారు. దేశంతోపాటు దేశాన్ని రక్షించే నిర్మాణాలపై దాడి చేయడం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యూహంలో భాగమని పాత్ర ఆరోపించారు.
ఇదంతా జార్జ్ సోరోస్ పనే: అమిత్ మాలవియా
పార్లమెంట్ సమావేశాలకు ముందు, అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టేప్పుడు అదానీ అంశం ప్రస్తావనకు రావడంపై బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ చర్య అనుమానాలకు తావిస్తున్నదని ఆ పార్టీ ఐటీ డిపార్ట్మెంట్హెడ్ అమిత్మాలవియా అన్నారు. ఈ అంశంపై జైరాం రమేశ్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై మాలవియా రిప్లై ఇచ్చారు. అదానీపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్‌కు కాంగ్రెస్ అండగా నిలుస్తున్నదని అన్నారు. 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి వరకూ అదానీ గ్రూపు లంచం ఇచ్చినట్టు చెబుతున్న అధికారులు ఉన్న రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష పార్టీలు పాలించినవేనని చెప్పారు. ఇందులో ఒడిశా, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలే ఇక్కడ అధికారంలో ఉన్నాయని తెలిపారు.