- మూడు స్థానాలకు ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఈ వారంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం బీజేపీ ఓ కమిటీని నియమించింది. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఆ పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ కుమార్ ఆ కమిటీలో ఉన్నారు. అలాగే, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల కోసం కూడా కమిటీని వేసింది. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి, పార్టీ నేతలు అరూరి రమేశ్, వినోద్ రావు, బంగారు శ్రుతి ఆ కమిటీలో ఉన్నారు.
కాగా.. వచ్చే ఏడాది మార్చిలో రెండు టీచర్ స్థానాలు, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదే సెగ్మెంట్ నుంచి టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్ సెగ్మెంట్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్నది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈవారంలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నేరుగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది.